ఏపీలో వినాయక చవితి ఉత్సవాలపై వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. కేంద్రం విధించిన కోవిడ్ నిబంధనల ప్రకారమే ఏపీలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించవద్దని తాము చెబుతున్నామని ఏపీ సర్కార్ వాదిస్తోంది. అయితే, వైఎస్ వర్ధంతితోపాటు పలు కార్యక్రమాలకు లేని కోవిడ్ నిబంధనలు కేవలం వినాయక చవితి ఉత్సవాలకు మాత్రమే ఎందుకు విధిస్తున్నారంటూ ఇటు టీడీపీ , అటు బీజేపీ నిలదీస్తున్నాయి.
ఇక, ఈ క్రమంలోనే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ…ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఈ నెల 10వ తేదీన వినాయక చవితి పూజా కార్యక్రమాలను నిర్వహించాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ వైఖరిపై చంద్రబాబు మండిపడ్డారు. ఈ క్రమంలోనే వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ కు హైకోర్టు షాకిచ్చింది.
ఏపీలోని ప్రైవేటు స్థలాల్లో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కు ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. అయితే, ఉత్సవాల సమయంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు నిర్వహించాలని హైకోర్టు సూచించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని సూచించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే అధికారం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
పబ్లిక్ స్థలాలు, రోడ్లు, వీధులలో వినాయకుడి విగ్రహాలు పెట్టి ఉత్సవాలు నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను హైకోర్టు సమర్థించింది. ఈ క్రమంలోనే ప్రైవేటు స్థలాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతినివ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ప్రజలంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.