రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే పథకానికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు పచ్చజెండా ఊపింది. అయితే.. కొన్ని కీలక షరతులు విధించింది. అదేసమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఈ కేసును విచారించిన హైకోర్టు.. అనూహ్యమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇప్పటి వరకు ఉన్న రేషన్ దుకాణాల విధానాన్ని.. పక్కన పెట్టి.. ఇంటింటికీ రేషన్ సరుకులను అందించే కీలక పథకానికి ఇటీవల జగన్ శ్రీకారం చుట్టారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల వాహనాలను ఏర్పాటుచేశారు. ప్రతి నెల 1వ తారీకు నుంచి పదో తారీకు మధ్య ఈ వాహనాలు ఇంటింటికీ వెళ్లి.. రేషన్‌ను సరఫరా చేస్తాయి. ఈ కీలక కార్యక్రమం ఫిబ్రవరి ఒకటో తేదీ (అంటే..సోమవారం)నుంచి ప్రారంభించాలని అప్పట్లోనే ప్లాన్ సిద్ధం చేసుకున్నారు.ఈ కార్యక్రమంపై జగన్ సర్కారు చాలానే ఆశలు పెట్టుకుంది. అయితే.. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ ఇంటింటి పంపిణీకి కూడా కోడ్ వర్తిస్తుందని.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. సో.. ఎన్నికలు ముగిసిన తర్వాత చేపట్టాలని సూచించారు.
అయితే.. నిమ్మగడ్డ రమేష్ ఇచ్చిన ఈ సూచనలపై ప్రభుత్వం వెంటనే(శనివారం రాత్రే) హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని ఆదివారం అత్యవసరంగా విచారించిన హైకోర్టు.. ఇంటింటి రేషన్ వాహనాలు తిప్పుకొనేందుకు అనుమతించింది. అయితే.. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం సాగాలని సూచించింది. ఇక, దీనిపై ఎస్ ఈసీ నిమ్మగడ్డ కూడా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ.. ఐదు రోజుల పాటు సమయం ఇచ్చింది. పేదల కోసం పెట్టిన పథకం కనుక నిమ్మగడ్డ సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచిస్తూనే ప్రభుత్వంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. పథకాలను ఎవరూ సొంత డబ్బులతో ప్రవేశ పెట్టరని, ఆయా వాహనాలపై రాజకీయ పార్టీల రంగులు ఉండరాదని సూచించింది. మొత్తానికి ఈ తీర్పు కొంత ఇష్టం.. కొంత కష్టంగా మారిందని వైసీపీ వర్గాలు అప్పుడే గుసగుస మొదలుపెట్టడం గమనార్హం.