అమరావతిలో ఇపుడున్న హైకోర్టు భవనానికి అదనపు భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇపుడున్న భవనం హైకోర్టు పూర్తిస్ధాయి కార్యకలాపాలకు సరిపోవటంలేదు. ఇదే విషయాన్ని హైకోర్టు ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. తమ అవసరాలకు వెంటనే మరో భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. దాంతో హైకోర్టు ఉన్నతాధికారుల సూచనల మేరకు ఇపుడున్న భవనం పక్కనే అదనంగా మరో భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గ్రౌండ్+ మూడంతస్తుల భవనం నిర్మాణం 76 వేల చదరపు అడుగుల్లో ఉంటుందని సమాచారం. దీని నిర్మాణానికి రు. 30 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మొదట్లో 5 అంతస్తులు నిర్మించాలని అనుకున్నా ఎందువల్లో రెండంతస్తులు తీసేసి మూడంతస్తులకే ప్రభుత్వం పరిమితమైంది. ఇపుడున్న భవనం హైకోర్టు అవసరాలకు ఏమాత్రం సరిపోదన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇదంతా బాగానే ఉందికానీ కర్నూలుకు న్యాయ రాజధానిని తరలించేందుకు ప్రభుత్వం చాలా రోజులుగా ఎదురుచూస్తోంది. ఆ సమయం ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తోంది. ఇప్పటికే మానవహక్కుల కమీషన్, లా కమీషన్ కార్యాలయాలను కర్నూలులోనే ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో ఇపుడున్న హైకోర్టుకు అదనంగా మరో భవనాన్ని అమరావతిలోనే నిర్మించటంలో అర్ధమేంటి ? అన్నదే అర్ధం కావటంలేదు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కర్నూలుకు హైకోర్టు తరలివెళ్ళటం ఇప్పుడిప్పుడే జరిగేపని కాదా అనే డౌటు పెరిగిపోతోంది.