ఏపీ లో కూటమి సర్కార్ నుంచి తాజాగా మరో తీపి కబురు బయటకు వచ్చింది. విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రంలోని ఆలయాలకు అందించే ధూప, దీప నైవేద్య సాయంను ప్రభుత్వం రెట్టింపు చేసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు నారా లోకేష్ `యువగళం` పేరుతో పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో లోకేష్ ప్రతి జిల్లాలో నెలకొన్న సమస్యలను, ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
ఈ క్రమంలోనే ఆలయాల్లో అర్చకత్వం చేస్తున్న బ్రాహ్మణులు తమ సమస్యలను లోకేష్ కు వివరించారు. ప్రధానంగా ఆలయాలకు ధూప, దీప నైవేద్య సాయం పేరిట ప్రభుత్వం నుంచి రూ.5 వేలు అందుతున్నాయని, కానీ ఆ సాయం సరిపోవట్లేదని ఆలయ అర్చకులు తెలిపారు. దాంతో ఆనాడు లోకేష్ వారికి అండంగా ఉంటామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
దసరా సందర్భంగా.. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ఆలయ అర్చకులకు తీపి కబురు చెప్పారు. ఆలయాల్లో ధూప, దీప నైవేద్యం కొరకు ప్రతినెలా అందిస్తున్న రూ. 5 వేల సాయాన్ని.. ఇక నుండి రూ.10 వేలకు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. మరోవైపు లోకేష్ కూడా ఈ విషయంపై స్పందిస్తారు.
ధూప, దీప నైవేద్య సాయాన్ని రూ.10 వేలకు పెంచడం ద్వారా రాష్ట్రంలోని 5,400 చిన్న ఆలయాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా భగవంతుడి సేవకు ఆస్కారం ఏర్పడిందని.. అందరి క్షేమం కోరే గొప్ప మనసున్న ప్రభుత్వం తమదని లోకేష్ పేర్కొన్నారు. ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో ఆలయాల అర్చకులు, కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.