రాష్ట్రంలో అనూహ్యమైన పరిణామం తెరమీదికి వచ్చింది. స్వయం ప్రతిపత్తి ఉన్న ఎన్నికల సంఘంతో ప్రభుత్వం ఢీ అంటే ఢీ అంటోంది. దీనికి సంబంధించిన వివాదం ఎలా ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని మరో పరిణామం తెరమీదికి వచ్చింది.
రాజ్యాంగ బద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించేది లేదంటూ.. ఉద్యోగ సంఘాలు తెరమీదికి వచ్చాయి. అంతేకాదు .. ఎన్నికలకు సహకరించేది కూడా లేదని తెగేసి చెబుతున్నాయి. కొన్ని సంఘాల నాయకులు ఏకంగా .. ఎన్నికల కమిషనర్‌ను కార్నర్ చేస్తూ.. వ్యాఖ్యలు సంధిస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటి వరకు ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘంగా ఉన్న స్థానిక ఎలక్షన్స్ వివాదం.. ఇప్పుడు ఉద్యోగులు వర్సెస్ ఎన్నికల సంఘంగా మారిపోతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిజానికి తమ పై అధికారి ఆదేశాలను పాటించకపోతేనే.. నిబంధనల మేరకు మాన్యువల్ ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి రాజ్యాంగ బద్ధమైన సంస్థ.. ఇచ్చిన ఆదేశాలు.. ఎన్నికల షెడ్యూల్‌ను కూడా పక్కన పెట్టి.. ఏకంగా ఎన్నికల కమిషనర్‌నే ఎదిరించే పరిస్థితి ఇప్పుడు ఉద్యోగులకు వచ్చింది. నిస్సందేహంగా ఈ ధైర్యం వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారనేది విశ్లేషకుల మాట.
అంటే.. ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇలాంటి పరిస్థితిలో ఎవరిది పైచేయి అవుతుంది? ఇలాంటి పోకడల కారణంగా ఎవరు నష్టపోతారు? ఎన్నికల సంఘానికి ఏమైనా జరుగుతుందా? లేక ఉద్యోగులు, వారి సంఘాలు భ్రష్టు పడతాయా? అంటే.. ఉద్యోగులకే భారీ ఎదురు దెబ్బతగిలే పరిస్థితి ఉంటుందని అంటున్నారు సీనియర్ అధికారులు. తమ న్యాయమైన కోర్కెలను లేదా.. కరోనా సమయంలో ముందస్తు.. జాగ్రత్తలు కోరడంలో ఉద్యోగుల తప్పు ఉండదని.. చెబుతున్నారు.
అలా కాకుండా రాజకీయంగా ఎన్నికల కమిషన్‌ను టార్గెట్ చేస్తే.. రేపు కోర్టులో కూడా వీరు దోషులుగా నిలబడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి విషయంలో ఉద్యోగులు నష్టపోయే ప్రమాదమే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మరి ఈ విషయం వీరికి తెలియదా? అంటే.. తెలుసు.. కానీ. ప్రభుత్వ పెద్దల మెప్పుకోసం.. ఇలా చేస్తున్నారనేది సుస్పష్టం. మరి ఇప్పటికైనా.. తమ బాధ్యతలు, విధులు తెలుసుకుంటే బెటర్ అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా జగన్ వ్యూహంలో చిక్కుకుంటే.. బలయ్యేది ఉద్యోగులేనని హెచ్చరిస్తున్నారు.