జగన్‌ రెడ్డికి కంపెనీలన్నీ బై బై చెబుతున్నాయి:లోకేశ్

సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. విగ్రహాల ధ్వంసం కేసుల్లో నిందితులను జగన్ గాలికొదిలేశారని, ఇదే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విగ్రహాల ధ్వంసం కేసుల్లలో సమాచారం ఇచ్చిన వ్యక్తులను, పాత్రికేయులను వేధించడమే జగన్ పాలన అని మండిపడ్డారు. జగన్ పాలనను చూసి రాష్ట్రంలో నుంచి కంపెనీలన్నీ తరలివెళుతున్నాయని, జగన్‌రెడ్డికి బై బై చెప్పేస్తున్నాయని ఎద్దేవా చేశారు. విశాఖలో పదేళ్ల కిందట ఏర్పాటైన హెచ్ఎస్ బీసీ ద్వారా 2 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి దక్కిందని, అలాంటి సంస్థ రాష్ట్రాన్ని విడిచిపెట్టి పోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని లోకేశ్ ఆరోపించారు. విధ్వంసం, వైసీపీ నేతల బెదిరింపుల వల్ల ఏపీలో పలు సంస్థల వారు భయంతో పారిపోతున్నారని ఆరోపించారు.

జగన్ రెడ్డి ముఖం చూసి ఒక్క కొత్త కంపెనీ కూడా ఏపీకి రాలేదని, టీడీపీ హయాంలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని లోకేశ్ మండిపడ్డారు. జగన్ రెడ్డి నిర్లక్ష్య ధోరణి నిరుద్యోగులకు శాపంగా మారిందని విమర్శించారు. జగన్‌రెడ్డి పత్రికలో కనిపించిన పండుగ రైతుల కళ్లలో కనిపించడం లేదని మండిపడ్డారు. పండిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర ఇస్తామని జగన్ ఇచ్చిన మాట గాలి మాటగానే మిగిలిపోయిందని దుయ్యబట్టారు. అర్థపర్థం లేని నిబంధనలు, అరకొర కొనుగోళ్లు రైతులకు శాపంగాను, దళారులకు వరంగాను మారాయని నిప్పులుల చెరిగారు. కొన్న ధాన్యానికి చెల్లింపులు చేయరని, రైతులు ఎలా పండుగ చేసుకోవాలి జగన్‌రెడ్డీ అని ‌ లోకేశ్ ప్రశ్నించారు.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జగన్ పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.  కరోనా కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ను టీడీపీ వ్యక్తి అన్నారని, కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నిమ్మగడ్డను టీడీపీ వ్యక్తి అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా ప్రభావం తగ్గినందునే స్కూల్స్‌ తెరిచామంటున్న ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఎందుకు మొగ్గు చూపడం లేదని ప్రశ్నించారు. జగన్ చెత్త పాలన చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని పీకే రహస్య నివేదిక ఇచ్చారని, అందుకే పులివెందుల పిల్లికి లోకల్ ఎన్నికలు అనగానే వణుకు పుట్టిందని ఎద్దేవా చేశారు. కాగా, టీడీపీ ప్రభుత్వం తొలగించిన ఆలయాలను పునర్నిర్మిస్తున్నామని జగన్ గొప్పగా చెప్పుకొంటున్నారని, కానీ, అదే స్థలంలో వాటిని ఎందుకు నిర్మించడం లేదని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.