సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్, విడుదల వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. బెయిల్ పై అల్లు అర్జున్ విడుదలైన తర్వాత ఆయనను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. మెగా స్టార్ చిరంజీవి కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అల్లు అర్జున్ ను కలిసేందుకు బయలుదేరారని ప్రచారం జరిగినా ఆయన రాలేదు.
ఆ తర్వాత బన్నీకి పవన్ ఫోన్ చేసినట్లు కూడా ఎక్కడా ప్రచారం జరగలేదు. ఈ క్రమంలోనే తాజాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై పవన్ కల్యాణ్ తొలిసారి స్పందించారు. మనుషులు చనిపోతే సినిమాల గురించి ఏం మాట్లాడతాం అని పవన్ మీడియా ప్రతినిధులు అల్లు అర్జున్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. అయినా ఇది సంబంధం లేని ప్రశ్న…ఇప్పుడు అప్రస్తుతం అని కడపలో ఎంపీడీవోను పరామర్శించిన సందర్భంగా మీడియాతో పవన్ అన్నారు.
సినిమాల కంటే పెద్ద సమస్యలపై డిబేట్ పెట్టాలని, ప్రశ్నలు అడగాలని మీడియా ప్రతినిధులకు పవన్ సూచించారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ అంశంపై ఇప్పటిదాకా పవన్ స్పందించకపోవడంతో వారిద్దరి మధ్య గ్యాప్ కొనసాగుతోందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తాజాగా పవన్ వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని వారు అంటున్నారు.