చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ పై గుర్తు తెలియని వక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున కొంతమంది రంగరాజన్ ఇంటిపై దాడి చేశారు. అడ్డొచ్చిన ఆయన కుమారుడిని కొట్టి గాయపరిచారు. చిలుకూరు బాలాజీ ఆలయ మెనేజింగ్ కమిటీ ఛైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు.
శ్రీ రంగరాజన్ గారిపై దాడి దురదృష్టకరమని.. ఇది ఒక వ్యక్తిపై కాదు… ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ` చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. దురదృష్టకరమైన ఘటన ఇది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిని ఒక వ్యక్తిపై చేసినట్లుగా కాకుండా- ధర్మ పరిరక్షణపై చోటు చేసుకున్న దాడిగా భావించాలి. కొన్ని దశాబ్దాలుగా శ్రీ రంగరాజన్ గారు ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపిస్తున్నారు… పోరాటం చేస్తున్నారు.
రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్ళిన ఒక మూక శ్రీ రంగరాజన్ గారిపై దాడి చేయడం వెనక ఉన్న కారణాలు ఏమిటో పోలీసులు నిగ్గు తేల్చాలి. ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పలు విలువైన సూచనలను శ్రీ రంగరాజన్ గారు నాకు అందించారు. టెంపుల్ మూమెంట్ అనే కార్యక్రమం ఏ దశలో ప్రారంభించాల్సి వచ్చిందో తెలియచేశారు. హిందూ ఆలయాల నిర్వహణ, ధర్మ పరిరక్షణపై ఆయన ఎంతో తపన పడుతున్నారు. ఆయనపై చోటు చేసుకున్న దాడిని ప్రతి ఒక్కరం ఖండించాలి. చిలుకూరు వెళ్ళి శ్రీ రంగరాజన్ గారిని పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇవ్వాలని జనసేన పార్టీ తెలంగాణ విభాగానికి దిశానిర్దేశం చేశాను.` అంటూ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.