ప్రధాని నరేంద్ర మోడీతో జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. బుధ వారం ఉదయం పార్లమెంటుకు వెళ్లిన ఆయన.. అక్కడి ప్రధాని కార్యాలయంలో మోడీతో భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాలపాటు ప్రధానితో చర్చించారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత బొబ్బిలి వీణను ప్రధానికి బహూకరించారు. అనంతరం ప్రత్యేకంగా ఇరువురు చర్చించుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన పవన్ కల్యాణ్.. రాష్ట్ర సమస్యలపై ప్రధానితో చర్చించినట్టు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, గత ప్రభుత్వం చేసిన పనులను సరిదిద్దుతున్నా మని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర సహకారం ఇప్పుడు రాష్ట్రానికి చాలా కీలకమని ఆ విషయాలపైనే ప్రధానితో చర్చించినట్టు చెప్పారు. నిధులు-సమస్యలు పరిష్కరించాలని కోరినట్టు తెలిపారు. అనంత రం పార్లమెంటు సెంట్రల్ హాల్లో పలువురు బీజేపీ ఎంపీలు పవన్‌తో ముచ్చటించారు. అదేవిధంగా బీజేపీ ఏపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ కూడా అయిన పురందేశ్వరి కూడా పవన్‌తో చర్చించారు.
మోడీతో మాట వెనుక!
ప్రధాని నరేంద్ర మోడీతో చర్చల వెనుక కేవలం రాష్ట్ర సమస్యలే ఉన్నాయా? వాటి కోసమే పవన్ ప్రధాని ని కలిశారా? అంటే కేవలం వాటికోసమే కాదని ఢిల్లీ మీడియా వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభ సీట్ల ఉప ఎన్నికపై కూడా పవన్ మోడీతో చర్చించి ఉంటారని పేర్కొంటున్నాయి. త్వరలోనే ఏపీలో మూడు స్థానాలకు ఉప పోరు జరగనుంది.
ఈ నేపథ్యంలో ఒక స్థానాన్ని తమకు ఇవ్వాలన్నది పవన్ విన్నపం. దీనికి బీజేపీ నేతలు కూడా పోటీ పడుతున్న క్రమంలో ఆయన నేరుగా ప్రధానిని కలిసి ఒప్పించేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. మరి మోడీ అభయం దక్కినట్టేనా? కాదా? అన్నది తేలాల్సి ఉంది.