అభిమానులు ప్రేమతో ఆయన్ని పవర్ స్టార్ అని పిలుచుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా అద్భుతమైన నటనతో అశేషమైన అభిమానులను సంపాదించుకున్నారు పవన్ కల్యాణ్. చిత్ర పరిశ్రమలో ట్రెండు సెట్ చేస్తూ రికార్డులు తిరగరాస్తూ ఆయన సాగుతుంటారు. పవర్ స్టార్ అనే పేరుకు తగ్గట్లుగా దూసుకెళ్తుంటారు. ఇప్పుడు రాజకీయాల్లోనూ ఆయన పవర్ స్టార్‌గా మారారు. దాదాపు దశాబ్దపు నిరీక్షణకు ముగింపు పలుకుతూ పొలిటికల్ పవర్ స్టార్‌గా అవతరించారు.
జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లో ప్రక్షాళన కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం పవన్ కంకణం కట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీకి మద్దతుగా నిలిచిన పవన్ పోటీ చేయలేదు. కానీ 2019లో ఒంటరిగా బరిలో దిగినా ఫలితాలు కలిసి రాలేదు. ఆ తర్వాత పార్టీపై ఫోకస్ పెట్టిన ఆయన ప్రజల్లోకి వెళ్లారు. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా, వ్యతిరేక ఓటు చీలకూడదనే ధ్యేయంతో కూటమి ఏర్పాటుకు బాటలు వేశారు. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అఖండ విజయం సాధించింది.
జనసేన 21కి గాను 21 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో పవన్‌కు జనాల్లో ఫాలోయింగ్ మరింత పెరిగింది. సీఎం చంద్రబాబు కూడా పవన్‌కు ప్రయారిటీ ఇస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖలు కట్టబెట్టారు. బుధవారం (జూన్ 19న) మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. దీంతో పాలిటిక్స్‌లోనూ పవన్ పవర్ స్టార్‌గా మారారు. పవర్ ఆయన చేతుల్లోకి వచ్చిందని అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, పర్యావరణ, శాస్త్ర సంకేతిక, అటవీ శాఖ మంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టారు. ఉపాధి హామీ పథకానికి ఉద్యాన వన పనులను అనుసంధానించి నిధుల మంజూరుపై, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణాలపై పవన్ మొదట సంతకాలు చేశారు.