నిత్యం ఏదో ఒక లిటిగేషన్ తో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంను ఆశ్రయిస్తున్న తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల తీరుపై అత్యున్నత న్యాయస్థానం చిరాగ్గా ఉందా? రాజకీయమే పరమావధిగా చేసుకుంటూ.. తీసుకుంటున్న నిర్ణయాలు.. అందులో భాగంగా తరచూ కోర్టుకు వెళ్లి పిటిషన్లు దాఖలు చేస్తున్న తీరుపై మండిపాటు వ్యక్తమైంది. అంతేకాదు.. రెండు రాష్ట్రాల్లోని రాజకీయానికి.. రాజకీయ నేతల తీరును వేలెత్తి చూపిస్తూ.. సుప్రీం న్యాయమూర్తులు చేసిన ఘాటు వ్యాఖ్య తర్వాతైనా తెలుగు నేతలకు బుద్ధి వస్తుందా? అన్నది ప్రశ్న.
ఇంతకూ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే.. ఏపీ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్.. ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్ మెంట్ నిర్ధారణలో అక్రమాలు జరిగినట్లుగా మాజీ మంత్రి నారాయణతో సహా ఏపీ సీఐడీ కేసు నమోదు చేయటం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫిర్యాదును మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేశారు. దీంతో.. వీరిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి నారాయణ.. లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్.. కేవీపీ అంజనీకుమార్ లపై కేసులు నమోదయ్యాయి.
దీంతో.. తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వారు ఏపీ హైకోర్టు ఆశ్రయించటం.. అందుకు ఓకే చెప్పటం తెలిసిందే. ఈ ముందస్తు బెయిల్ రద్దు కోసం ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించిన విచారణ సోమవారం వచ్చింది. జస్టిస్ బీఆర్ గవాయి.. జస్టిస్ బీవీ నాగరత్నంతో కూడిన ధర్మాసనం ముందు సోమవారం విచారణకు వచ్చింది. బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హరీన్ రావల్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో నిందితులు బెయిల్ అప్లికేషన్లను పరిగణలోకి తీసుకొనేటప్పుడు సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల్ని హైకోర్టు పట్టించుకోలేదని.. తగిన ఆధారాలు ఉన్నప్పటికీ పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ గవాయి జోక్యం చేసుకుంటూ.. తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ ల నుంచి రోజు ఏదో ఒక లిటిగేషన్ పుట్టుకొస్తుందని.. రోజూ ఏదో ఒక కేసు వస్తోందన్నారు.
ఈ కేసు వాదనల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది వాదనలపై స్పందించిన జస్టిస్ గవాయి స్పందిస్తూ.. మీ రాజకీయ పగల్లో తాము భాగస్వామ్యం కావాలనుకోవటం లేదన్నారు. తాము హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్ని చూశామని.. అందులోని వ్యాఖ్యల్లో దర్యాప్తును ప్రభావితం చేయకూడదన్నది తమ అభిప్రాయంగా చెప్పారు. హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో ప్రభావితం కాకుండా దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టొచ్చని.. అందులో ప్రతివాదులు దర్యాప్తునకు సహకరించకుంటే.. వారి బెయిల్ రద్దు కోసం దర్యాప్తు సంస్థ దరఖాస్తు చేసుకోవచ్చంటూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా కేసు విచారణలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులను సుప్రీం న్యాయమూర్తి ప్రస్తావించిన తీరు చూస్తే.. తెలుగు రాష్ట్రాల ఇమేజ్ బయట నుంచి చూసే వారికే ఎంత చిరాకును కలిగిస్తుందో అర్థమవుతుందన్న మాట వినిపిస్తోంది. ఇలానే పరిస్థితి సాగితే.. తెలుగు రాష్ట్రాల నుంచి ఫైలయ్యే రాజకీయ పిటిషన్లు మరింత పలుచన చేయటం ఖాయమని చెప్పక తప్పదు.