సీఎం జగన్ అధికారం చేపట్టిన వెంటనే హడావిడిగా ప్రజావేదికను కూల్చడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రజావేదికలో పనికి వచ్చే మెటీరియల్ ను వేరే చోటికి తరలించడమో, లేదంటే టెండర్ పిలిచి అమ్మడమో చేసిన తర్వాత కూలగొట్టడమో చేస్తే కోట్ల రూపాయలు ఆదా అయ్యేవని అప్పట్లో అనుకున్నారు. తాజాగా రెండున్నరేళ్ల తర్వాత దాదాపు అదే తరహాలో కడపలోని అన్న క్యాంటీన్ ను మున్సిపాలిటీ అధికారులు అర్ధరాత్రి కూల్చివేయడంపై విమర్శలు వస్తున్నాయి.
అర్ధరాత్రి వేళ అత్యవసరంగా అన్న క్యాంటీన్‌ను అధికారులు కూల్చివేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. క్యాంటీన్లోని విలువైన, ఉపయోగపడే వస్తువులను బయటకు తీయకుండా అలాగే కూల్చివేయడంపై స్థానిక టీడీపీ నేతలు, స్థానికులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ కడప నియోజకవర్గ బాధ్యుడు అమీర్‌బాబు నేతృత్వంలో నేతలు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
అయితే, కూల్చివేసిన క్యాంటీన్ ప్రాంతంలో నగరపాలక సంస్థ పెట్రోలు బంకు ఏర్పాటు చేస్తున్నామని కమిషనర్ రంగస్వామి తెలిపారు. కానీ, పెట్రోలు బంకు ఏర్పాటుకు నగరంలో చాలా ఖాళీ స్థలాలున్నాయని, అయినా అన్న క్యాంటీన్ భవనాన్ని కూల్చడం కక్ష సాధింపేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రూ. 30 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ క్యాంటీన్ ను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసివేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో కొవిడ్ కేంద్రంగా ఉపయోగించిన ఈ ప్రభుత్వం..ఉన్నపళంగా కూలగొట్టిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.