2020 ఈ ఏడాది ఎంతోమందికి చేదు అనుభవాలను మిగిల్చింది. ప్రపంచ దేశాలను వణికించిన కరోనా నామ సంవత్సరంగా 2020 చరిత్రలో నిలిచిపోతుంది. ప్రపంచ దేశాల ప్రజలు కరోనా నేపథ్యంలో 2020ని గుర్తుపెట్టుకుంటారు. అయితే, ఏపీ ప్రజానీకం మాత్రం కరోనా కష్టాలతో పాటుగా జగన్ ఏడాదిన్నర పాలనలో పడిన అష్ట కష్టాలు ఆజన్మాంతం మరచిపోలేరు.
రాత్రికి రాత్రి ప్రజా వేదిక ధ్వంసంతో మొదలైన జగన్ పాలన తాజాగా ఆలయాల విధ్వంసం ఆరోపణలతో కొనసాగుతోంది. కరోనాకు పారాసిటమాల్ సరిపోతుందని చెప్పడంతో వెలుగుచూసిన జగన్ నిర్లక్ష్యం…..తాజాగా ఆలయాల ఆస్తులు, విగ్రహాల ధ్వంసం వ్యవహారాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా దేవుడిపై భారం వేసి చేతులు దులుపుకునే వరకు చేరుకుంది.
గత ఏడాది విశాఖలోని ఎల్ జి పాలిమర్స్ సంస్థలో విషవాయువు లీకేజీ వ్యవహారం పెనుదుమారం రేపింది. ఈ ఘటనకు కారణమైన ఎల్ జి పాలిమర్స్ పై జగన్ నామమాత్రపు చర్యలు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇక, ఏలూరులో అంతుచిక్కని వ్యాధి..కలుషిత నీరు వ్యవహారం మరో కరోనా అన్న రేంజ్ లో ప్రజలను భయాందోళనలకు గురి చేసింది.
తాజాగా ఏపీని అతలాకుతలం చేసిన నివర్ వరకు ప్రకృతి విపత్తులు కూడా ఏపీ ప్రజలను బెంబేలెత్తించాయి. ఇక, దీనికి తోడు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నేతల అవినీతి, అక్రమాలు, మూడు రాజధానుల కుట్రలు, అమరావతి ఉద్యమంపై ఉదాసీనత వంటి వ్యవహారాలు ఏపీ ప్రజలకు చేదు అనుభవాలు మిగిల్చాయి.
పీడకల వంటి 2020లో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఏపీ ప్రజలు కొత్త సంవత్సరం 2021పై కోటి ఆశలు పెట్టుకున్నారు. తమకు సినిమా కష్టాలు చూపించి 20-20 ఆడిన 2020 త్వరగా వెళ్లిపోవాలని ఏపీ ప్రజలంతా ఆకాంక్షించారు. 2021లో ఏపీ ప్రజలతోపాటు ప్రపంచదేశాల ప్రజలంతా బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిద్దాం.