ఎప్పుడేం ట్వీట్ పోస్టు చేసి రచ్చ చేస్తుందో అర్థం కానట్లుగా వ్యవహరిస్తూ ఉంటుంది అనసూయ. పేరుకు యాంకరే అయినా.. హీరోయిన్ కు ఉండే క్రేజ్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉండే ఆమె.. అప్పుడప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంటుంది.
ఏజ్ మీద పడుతున్న కొద్దీ.. గ్లామర్ డోస్ ను అంతకంతకూ పెంచేసే.. నిద్రకు దూరం చేసే అమ్మడు.. అప్పుడప్పుడు తన ట్వీట్లతో కొత్త రచ్చకు తెర తీస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి పోస్టు ఒకటి పెట్టింది.
ఫలానా వారిని అన్నామన్న విషయాన్ని సూటిగా చెప్పని ఆమె.. ఒక సంచలన హీరోను టార్గెట్ చేసినట్లుగా ఆమె ట్వీట్ ఉందంటున్నారు. ఇంతకూ ట్వీట్ లో ఏమున్నదంటే.. ‘‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు.కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా’’ అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇంతకీ అనుసూయ టార్గెట్ ఎవరు? ఎందుకు ఇలాంటి ట్వీట్ చేసింది? అన్న ప్రశ్నలు ఇప్పుడు చాలామందిని తొలిచేస్తున్నాయి. కొందరైతే.. ఎవరిని అంటున్నావో చెప్పొచ్చుకదా? అని అడిగేస్తున్నారు కూడా. అయితే.. సినీ వర్గాల అంచనా ప్రకారం చూస్తే… ఈ ట్వీట్ వెనుక స్టోరీ ఇప్పటిది కాదని.. ఐదేళ్ల క్రితం నాటి పంచాయితీగా చెబుతున్నారు.
ఐదేళ్ల క్రితం ఇదే ఆగస్టు 25న విజయ్ నటించిన అర్జున్ రెడ్డి మూవీ విడుదల కావటం.. ఆ మూవీలో అమ్మను తిడుతూ ఒక బూతు ఉండటం.. దాన్ని హైలెట్ చేయటం తనకు నచ్చలేదంటూ అప్పట్లో మీడియా ముందుకు వచ్చి తన మనసులోని మాటను చెప్పేసింది అనసూయ. దీంతో రచ్చ మొదలైనా.. కొంతకాలానికి అంతా సర్దుకున్నట్లైంది.
ఆ తర్వాత ఈ ఇష్యూను ఎప్పుడూ లేవనెత్తని ఆమె.. తాజాగా లైగర్ సినిమా విడుదలై.. నెగిటివ్ టాక్ నడుస్తున్న వేళ.. సడన్ గా సోషల్ మీడియాలో ‘అమ్మను అన్న ఉసురు ఊరికే పోదు’ అంటూ చెలరేగిపోయిన ట్వీట్ చూస్తే.. పాత లొల్లిని కొత్తగా షురూ చేసిందన్న మాట వినిపిస్తోంది. అనసూయ ట్వీట్ తమ హీరోను ఉద్దేశించే అని విజయ్ అభిమానులు అంటున్నారు.
అసలు సినిమా విషయంలో నిరాశగా ఉన్న వేళ.. ఇలాంటి మాటలు పుండు మీద కారం చల్లినట్లు అవుతుందని.. ఇలాంటి కెలుకుడు సరికాదన్న మాట వినిపిస్తోంది. ఈ మాత్రం అనసూయ ఆలోచించదా? మరి.. ఎందుకు మంట పుట్టేలా ట్వీట్ చేసినట్లు చెప్మా?
— Nithin kumar (@NithinVi18) August 26, 2022