అమరావతి రాజధాని వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పుపై దేశపు అత్యున్నత న్యాయస్థానంలో జగన్ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఏపీ విభజన చట్టంపై గతంలో దాఖలైన పిటిషన్లను ఈ పిటిషన్ తో కలిపి విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. మరోవైపు, ఈ వ్యవహారంపై అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్ ను ఆ పిటిషన్ తో కలిపి ఒకేసారి విచారణ జరుపుతామని గతంలో సుప్రీంకోర్టు వెల్లడించింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది. అమరావతిపై ఏపీ హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసిన పిటిషన్ తో పాటు రైతులు దాఖలు చేసిన పిడిషన్లపై ఈనెల 28న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా దాఖలు అయిన పిటిషన్లు, అమరావతి అంశంపై దాఖలు అయిన పిటిషన్లను విడివిడిగా విచారణ జరపాలని దేశపు అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది.
తమ రాజధాని ఏది అనే విషయాన్ని రాష్ట్రాలు నిర్ణయించుకోవడం సమాఖ్య వ్యవస్థకు నిదర్శననమని ప్రభుత్వం అంటోంది. అమరావతిలోనే రాజధాని కేంద్రీకృతం చేయకుండా అధికార వికేంద్రీకరణ చేపట్టాలని పలు కమిటీలు నివేదికలు ఇచ్చాయని చెబుతోంది. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని రైతుల ఒప్పందాలలో ఉల్లంఘన జరగలేదని అంటోంది. మరోవైపు, అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందన్న ఉద్దేశంతో తమ భూములు ఇచ్చామని, తమ హక్కులు కాపాడాలని రైతులు అంటున్నారు.