ఇక్కడ నాగార్జునకు షాకిచ్చింది ఆయన భార్య అమల కాదులెండి. తన కొత్త చిత్రం ఘోస్ట్ కోసం హీరోయిన్గా తీసుకుందామనుకున్న మలయాళ భామ అమలా పాల్. ఈ సినిమాకు ముందుగా కాజల్ అగర్వాల్‌ను కథానాయికగా ఎంచుకున్నారు. ఐతే సినిమా షూటింగ్ కొంచెం ఆలస్యం కావడం.. ఈలోపు కాజల్ ప్రెగ్నెంట్ అయినట్లు వార్తలు రావడం తెలిసిందే.
ఈ కారణంతోనే కాజల్ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్ని ఎంచుకోక తప్పలేదు. నాగ్ సరసన మరీ యంగ్ హీరోయిన్లయితే బాగుండదని అమలా పాల్‌ను పరిగణనలోకి తీసుకున్నారట. ఆమె కూడా ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపించిందట. కాకపోతే ఘోస్ట్‌లో నటించేందుకు గాను కోటి రూపాయల పారితోషికం డిమాండ్ చేసిందట అమలా పాల్.
ఐతే తెలుగులో చాలా కాలం నుంచి సినిమాలే చేయని అమలకు ఇక్కడ పెద్దగా డిమాండే లేదు. పైగా ఆమె గతంలో నటించిన చాలా తెలుగు సినిమాలు నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో కోటి రూపాయలివ్వడం చాలా ఎక్కువని భావించి తనను ఈ సినిమాకు దూరం పెట్టినట్లు సమాచారం.
కోటి రూపాయలిస్తే ఇంకా పెద్ద స్థాయి హీరోయిన్ను తీసుకోవచ్చని భావించి ఆమెను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాకు కథానాయికగా ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి. గరుడవేగ తర్వాత అనుకోకుండా చాలా గ్యాప్ తీసుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఘోస్ట్ మూవీ తెరకెక్కుతోంది.
శరత్ మరార్, పుస్కర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మొదలుపెట్టినట్లే పెట్టి నాగ్ బ్రేక్ తీసుకున్నాడు. సంక్రాంతి రిలీజ్ మీద ఆశతో బంగార్రాజును లైన్లో పెట్టి చకచకా ఆ సినిమాను పూర్తి చేస్తున్నాడు. అది అయ్యాక ఘోస్ట్ మీదికి వస్తాడు. ఆలోపు కథానాయికను ఎంచుకోవాల్సి ఉంది.