భావ ప్రకటన స్వేచ్ఛ…భారత దేశంలో నివసిస్తున్న ప్రతి పౌరుడికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ఇది. సాధారణ పౌరుడికైనా, పాత్రికేయులకైనా, ప్రధాన మంత్రికైనా…అందరికీ ఈ హక్కును ఉపయోగించుకునే హక్కు ఉంది. ఒక రాజకీయ నాయకుడు మొదలు సామాన్యుడి వరకు తమ భావాలను, అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పే అధికారం ఇచ్చే హక్కు అది.
అయితే, ఈ మధ్యకాలంలో చాలామంది వ్యక్తులు ఆ భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుపెట్టుకొని నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. తమ భావాలను వ్యక్తీకరించాల్సింది పోయి…వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. అవతలివైపున్న వ్యక్తి మీద అభిప్రాయాలు చెప్పవలనసింది పోయి అడ్డదిడ్డంగా అడ్డగోలుగా మాట్లాడేస్తున్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి వంటి వారిని సైతం ఇష్టారీతిన దుర్భాషలాడుతూ కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా రాజ్యాంగంలోని ‘భావ ప్రకటనా స్వేచ్ఛ’పై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రధానిని, మంత్రులను తిట్టిపోయడం భావ ప్రకటన స్వేచ్ఛ కిందరకు రాదని తేల్చి చెప్పింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులకు వ్యతిరేకంగా విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తి పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఉత్తరప్రదేశ్ లోని జాన్ పూర్ కు చెందిన ముంతాజ్ మన్సూరి అనే వ్యక్తి…మోదీ, షాలతో పాటు ఇతర మంత్రులపై నోటికొచ్చినట్లు మాట్లాడాడు. దీంతో, అతడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, తాను భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం మాట్లాడానని, తనపై కేసు కొట్టి వేయాలని మన్సూరి కోర్టును ఆశ్రయించాడు. దీంతో, మన్సూరి వ్యవహారంపై కోర్టు నేడు విచారణ జరిపింది.
దేశ రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించిందని, అలా అని ఆ హక్కు ఏ పౌరుడిని గానీ, ప్రధాని, మంత్రులను గానీ దూషించడానికి, దుర్వినియోగం చేయడానికి వర్తించదని స్పష్టం చేసింది. మన్సూరి పిటిషన్ లో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి సహేతుక ఆధారాలు లేవని అలహాబాద్ కోర్టు ధర్మాసనం పేర్కొటూ ఆ పిటిషన్ ను కొట్టి వేసింది.