బ్రిటన్ కొత్త ప్రధానిగా భారత సంతతికి చెందిన వ్యక్తి, ఆర్థిక నిపుణులు రిషి సునక్ బ్రిటన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో, రిషి సునక్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆయన భార్య గురించిన వివరాలు తెలుసుకునేందుకు ఇంటర్నెట్ ను నెటిజన్లు జల్లెడపడుతున్నారు. మామూలుగానే మల్టీమిలియనీర్లుగా రిషి సునక్ దంపతులకు పేరుండగా…తాజాగా షాకింగ్ విషయం వెల్లడైంది. సునక్ భార్య అక్షతా మూర్తికి భారీగా ఆస్తులున్నాయని, బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్-2 ఆస్తులకన్నా అక్షత ఆస్తుల విలువే ఎక్కువని తెలుస్తోంది.
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూతురైన అక్షతా మూర్తికి ఇన్ఫోసిస్ లో పెద్ద మొత్తంలో వాటా ఉంది. ఏటేటా డివిడెండ్ రూపంలో భారీ మొత్తం అక్షతాకు దక్కుతోంది. అక్షత ఇప్పటికీ భారత పౌరసత్వం వదులుకోలేదు. దీంతో, భారత్ తోపాటు విదేశాలలోని కంపెనీల నుంచి అందుకునే డివిడెండ్, ఇతరత్రా ఆదాయంపై బ్రిటన్ లో పన్ను చెల్లించక్కర్లేదు. ఇది విమర్శలకు దారితీయడంతో బ్రిటన్ లో కూడా పన్ను కడతానని అక్షత వివరణ ఇచ్చారు.
ఇన్ఫోసిస్ లో అక్షతకు 3.89 కోట్ల షేర్ ఉండగా..మొత్తం షేర్లలలో ఇది 0.98 శాతమే. కంపెనీలో అక్షత వాటా విలువ దాదాపు రూ.6 వేల కోట్లకు పైమాటే. ఇటీవలే ఇన్ఫోసిస్ నుంచి రూ.126 కోట్లను డివిడెండ్ రూపంలో అక్షత అందుకున్నారు. అక్షతా డిజైన్స్ పేరుతో దుస్తుల తయారీ బ్రాండ్ సహా మూడు నాలుగు సంస్థలకు అక్షతే స్థాపించారు. వీటన్నిటి విలువను మదింపు చేస్తే క్వీన్ ఎలిజబెత్ ఆస్తుల కన్నా ఎక్కువేనట. రాణి ఆస్తుల విలువ మన కరెన్సీలో సుమారు 3400 కోట్లు. అక్షత ఆస్తుల విలువ రూ.4200 కోట్లు. ఇక, రిషి ఆస్తుల విలువ సుమారు రూ.3 వేల కోట్లు. బ్రిటన్ లో రిచెస్ట్ పర్సన్ అక్షతా మూర్తి కాగా, అక్కడి ప్రతినిధుల సభలోని ఎంపీలలో అత్యంత ధనవంతుడు రిషి సునక్.