టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వ్యతిరేకతలను పక్కనబెట్టి మరీ రేవంత్ కు పార్టీ హైకమాండ్ పగ్గాలు అప్పగించింది. దీంతో, రేవంత్ కు కొంతమంది కాంగ్రెస్ సీనియర్లు అంటీముట్టనట్లుగా ఉంటూ అసమ్మతి వర్గంలా మారారు. అంతేకాదు, వీలు చిక్కినప్పుడల్లా రేవంత్ పై విష ప్రచారం చేసి హైకమాండ్ దగ్గర మెప్పు పొందాలని ఆ అసమ్మతి నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
అయినా సరే…రేవంత్ వైపే హైకమాండ్ మొగ్గు చూపిందన్న ప్రచారం తాజాగా జరుగుతోంది. పార్టీ పెద్దల దగ్గర రేవంత్ పలుకుబడి పెరిగిందని, అసమ్మతి నేతలను ఏఐసీసీ దూరం పెట్టడమే ఇందుకు నిదర్శనమన్న వార్తలు వినిపిస్తున్నాయి. రేవంత్ పై అసమ్మతి స్వరం వినిపించి హైకమాండ్ దగ్గర మార్కులు కొట్టేద్దామనుకున్న అసమ్మతి పెద్దలను ఢిల్లీ పెద్దలు దూరం పెట్టారట. రేవంత్ పై వ్యతిరేకత వ్యక్తం చేద్దామని ఢిల్లీ వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్‌గాంధీతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
రేవంత్ కు హైకమాండ్ దగ్గర అంత వెయిట్ ఉండడంతో చేసేదేమీ లేక అసమ్మతి నేతలు నిరాశగా హైదరాబాద్ కు వెనుదిరగాల్సి వచ్చిందట. ఇక, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా అసమ్మతి నేతలకు దూరంగా ఉండడంతో వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏ రాష్ట్రంలోనూ అసమ్మతి నేతలను ప్రోత్సహించకూడదని అధిష్ఠానం తీర్మానించుకోవడం కూడా టీపీసీసీ అసమ్మతి నేతలకు కలిసి రాలేదని చెప్పవచ్చు.