ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా చర్చకు వచ్చిన, వస్తున్న అంశం కృత్రిమ మేథను(Ai). అయితే, దీనివల్ల ఒనగూరే మేలు కన్నా కూడా దీనిని నియంత్రించకుంటే వచ్చే రెండేళ్లలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంతర్జాతీయ నిపుణులు, టెక్ దిగ్గజ అధినేతలు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఇవి అనేక మందిని చంపే శక్తిమంతమైన ఆయుధాలను ఉత్పత్తి చేయ డంలో దోహదపడతాయని బ్రిటన్ ప్రధాని సలహాదారుడు మ్యాట్ క్లిఫర్డ్ ఆందోళన వ్యక్తం చేశారు.
‘ఎన్నో ప్రాణాలు తీయగల సైబర్, బయోలాజికల్ ఆయుధాలను సృష్టించే సామర్థ్యం కృత్రిమ మేధకు ఉంది. దీన్ని నియంత్రించకుంటే.. మానవుడు నియంత్రించలేని శక్తివంతమైన వ్యవస్థ ఏర్పాటుకు దారితీస్తాయి. ఏఐతో స్వల్ప, దీర్ఘకాలికంగా ఎన్నో రకాల ముప్పులు పొంచివున్నాయి. జీవాయుధాలు లేదా భారీ సైబర్ దాడులను చేసేందుకు అవసరమైన సాంకేతికత కోసం ఏఐను ఇప్పుడు వాడుకోవచ్చు. ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవి’ అని మ్యాట్ క్లిఫర్డ్ హెచ్చరించారు.
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ సాంకేతిక సలహాదారుగా వ్యవహరిస్తున్న క్లిఫర్డ్.. చాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ వంటి కృత్రిమ మేధ మోడల్స్‌పై పరిశోధన కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్ మోడల్ టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తున్నారు. అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్వెన్షన్ ఏజెన్సీ ఛైర్మన్‌గానూ ఉన్నారు. ఇదిలావుంటే, చాట్‌జీపీటీ వంటివి యావత్ మానవాళికి తీవ్ర ముప్పును తలపెట్టే ప్రమాదం ఉందని అంతర్జాతీయ టెక్ దిగ్గజ సంస్థల అధిపతులు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ తరహా వ్యవస్థల అభివృద్ధిని నియంత్రించాల్సిన అవసరం ఉందని కోరుతూ అనేక మంది నిపుణులు బహిరంగ లేఖ రాశారు. అందులో ఎలాన్ మస్క్ కూడా సంతకాలు చేశారు. దీన్ని సరైన విధంగా వినియోగించకుంటే హానికరమైన పరిణామాలు తప్పవని అటు గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్ హెచ్చరించారు. కృత్రిమ మేధ దుష్ర్పభావాలను తలచుకుంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని పిచాయ్ గతంలో చెప్పినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే.