చరిత్రలో ఎప్పుడూ చూడని విపత్తు విరుచుకుపడినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయన్నది తాజాగా విజయవాడను చూస్తే అర్థమవుతుంది. నగరంలోని సింగ్ నగర్ ను చూస్తే.. రోజూ బిజీగా ఉండేది ఈ ప్రాంతమేనా? అన్న సందేహం కలుగక మానదు. మూడు నాలుగు అడుగుల ఎత్తులో నీరు.. అంతకంతకూ వస్తున్నవరద నీరు నేపథ్యంలో.. ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. కష్టంలో ఉన్న వారిని కలిసేందుకు.. వారికి తాను ఉన్నానన్న భరోసాను.. ధైర్యాన్ని కలిగించేందుకు చంద్రబాబు పెద్ద సాహసమే చేశారు.
74 ఏళ్ల వయసులో చిన్నపాటి బోటులో సింగ్ నగర్ కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఏపీ ముఖ్యమంత్రి. ఆయన నిర్ణయాన్ని ఆయన సెక్యురిటీ సిబ్బంది నో చెప్పారు. భద్రతా పరమైన ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయాన్ని చెప్పినప్పటికీ.. వారి మాటల్ని వినని ఆయన.. మరేం ఫర్లేదంటూ సింగ్ నగర్ తో పాటు వరదలకు ప్రభావితమైన ప్రాంతాల్ని సందర్శించేందుకు.. అక్కడి వారికి భరోసా ఇచ్చేందుకు తానే స్వయంగా బయలుదేరారు.
తాము ఎంత చెప్పినా వినని సీఎం చంద్రబాబును బోటులో వెళ్లకుండా ఆపలేకపోయారు భద్రతా సిబ్బంది. చివరకు లైఫ్ జాకెట్ వేసుకున్న ఆయన.. బోటు ఎక్కి.. చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించారు. సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. సింగ్ నగర్ గండిని పూడ్చటంపై అధికారులతో మాట్లాడిన చంద్రబాబు.. బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్న ఆదేశాల్నిజారీ చేశారు. ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచన చేశారు. అంతేకాదు.. బాధితులకు భరోసా ఇస్తూ.. వరద నీరు తగ్గే వరకు తానే దగ్గరుండి స్వయంగా పర్యవేక్షిస్తానన్న హామీ ఇచ్చారు.
బాధితుల కష్టాల్ని తాను దగ్గర నుంచి చూశానని.. వారికి వెంటనే ఆహారం.. తాగునీరు అందిస్తామన్నారు. ఆరోగ్యం బాగోలేని వారిని ఆసుపత్రికి తరలిస్తామని చెప్పారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు విజయవాడ కలెక్టరేట్ లో ఉంటానని చెప్పిన ఆయన.. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా ఇంత వయసులోనూ యువకుడిలో ఉండే చురుకుదనం చంద్రబాబులో కనిపించిందంటూ చుట్టుపక్కల వారు మాట్లాడుకోవటం కనిపించింది.