2021లో జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు దొంగ ఓట్లకు తెరదీశా రని.. అక్రమాలు, అన్యాయాలకు పాల్పడ్డారని.. టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై అనేక దఫాలుగా విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం.. తాజా గా ఒక్కొక్కరుగా అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కలెక్టర్ సహా మెప్మా డైరెక్టర్‌పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది.
ఈ పరంపరలో తాజాగా పోలీసులపైనా కేంద్ర ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరించింది. నాటి ఉప ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులకు సహకరించారని.. ప్రతిపక్ష నాయకులు, మేధావులు ఇచ్చిన ఫిర్యాదులను బుట్టదాఖలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన డీఐజీ అమ్మిరెడ్డి.. చర్యలకు దిగారు.
తిరుపతి తూర్పు, పశ్చిమ పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు. తిరుపతి నగర తూర్పు , పశ్చిమ సీఐ లు సస్పెన్షన్ అయ్యారు. తిరుపతి తూర్పు సీఐ శివప్రసాద్ రెడ్డి , పశ్చిమ సీఐ శివప్రసాద్ సస్పెన్షన్ ఆర్డర్లు వెలువడ్డాయి. తిరుపతి తూర్పు పీఎస్ ఎస్ ఐ జయస్వాములును కూడా సస్పెండ్ చేశారు. తిరుపతి తూర్పు పీఎస్ హెడ్ కానిస్టేబుల్ ద్వారకనాధరెడ్డిని కూడా సస్పెండ్ చేశారు. అదేసమయంలో అలిపిరి సీఐ అబ్బన్నను వీఆర్ కు బదిలీ చేశారు.
తిరుపతి ఎంపీ ఉపఎన్నికల వేళ దొంగ ఓట్ల వ్యవహారం అప్పట్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిపక్ష నాయకులు కొన్ని ఫిర్యాదులు సమర్పించారు. అయితే.. ఈ కేసును నీరుగార్చారని పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. సాక్షాధారాలు లేవని కేసు మూసివేసిన పశ్చిమ సీఐ శివప్రసాద్. పోలీసులను సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో అదికారులు చర్యలు తీసుకున్నారు.