తెలంగాణ రాజధానిగా పాలన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ హైదరాబాద్ తనదైన ముద్ర వేస్తుందనడంలో సందేహం లేదు. తెలంగాణ ప్రజలతో పాటు ఏపీతో సహా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఇక్కడే సెటిలైన వాళ్లతో కలిపి హైదారబాద్ జనాభా కోటికి పైగా ఉంటుంది.
ఇక్కడ రాజకీయంగా పట్టు దొరికించుకోవడం కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆ దిశగానే హైదారబాద్ మహా నగరంలో తిరిగి పుంజుకునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ మళ్లీ భాగ్యనగరంపై గురి పెట్టారు.
2014లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత రాష్ట్ర సాధనలో ప్రధాన పాత్ర పోషించిన పార్టీగా టీఆర్ఎస్ను గుండెల్లో పెట్టుకున్న ప్రజలు దానికే అధికారాన్ని కట్టబెట్టారు. ఇక 2016లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని నడిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న కేటీఆర్ ఆ విషయం విజయవంతమయ్యారు.
హైదరాబాద్‌పై అప్పటివరకూ పట్టున్న కాంగ్రెస్ టీడీపీలను వెనక్కినెట్టిన టీఆర్ఎస్ ఏకంగా 99 సీట్లు గెలుచుకుంది. ఈ ఫలితాలతో కేటీఆర్ ప్రభ కూడా మరో స్థాయికి చేరింది.
కానీ గతేడాది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ బొక్కబోర్లా పడింది. సరిగ్గా ఎన్నికలకు ముందే నగరాన్ని వరదలు ముంచెత్తడం.. ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం ప్రజలకు అందకుండా అక్రమార్కుల ఖాతాలోకి చేరిందనే అభిప్రాయాలు కలిగాయి.
మరోవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ కూడా దూకుడు ప్రదర్శించారు. దీంతో ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవలం 56 స్థానాల్లో మాత్రమే గెలవగలిగింది. 2016 ఎన్నికలతో పోలిస్తే 43 సిట్టింగ్ స్థానాలు కోల్పోయింది. 48 చోట్ల గెలిచిన బీజేపీ సత్తాచాటింది.
ఈ ఫలితాల తర్వాత టీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధమవాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే రాష్ట్రంలోని అన్ని గ్రామాల మొదలు రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలు నియమించాలని కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగానే హైదరాబాద్‌పై మరోసారి కేటీఆర్ దృష్టి సారించారు.
టీఆర్ఎస్ మహానగర సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి కార్యకర్తలో జోష్ నింపే ప్రయత్నం చేశారు. దాదాపు అయిదారేళ్ల నుంచి గ్రేటర్‌కు ప్రత్యేకంగా టీఆర్ఎస్ కమిటీ అంటూ లేదు. అందుకే కేటీఆర్ తాజాగా కీలకమైన రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఉండేలా చూసి అందరికీ కలుపుకొని వెళ్లేవాళ్లకే పదవులు ఇవ్వాలని ఆ ప్రక్రియను ఈ నెలఖరు వరకూ పూర్తి చేయాలని కేటీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో నగరమంతటికీ ఒకే పార్టీ అధ్యక్షుణ్ని కాకుండా ఒక్కో జిల్లాకు ఒక్కో అధ్యక్షున్ని నియమించే అవకాశాలున్నాయి. మొత్తానికి కేటీఆర్ ప్రత్యేక చొరవతో తిరిగి గ్రేటర్ టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ వచ్చిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.