దేశంలో ప్రజలు తమ స్థానిక భాషల్లో కాకుండా మిగతా సందర్భాల్లో మాట్లాడేటపుడు ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీ మాట్లాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. షా చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ వంటి నేతలు తీవ్రంగా స్పందించారు. ఏం భాష మాట్లాడాలో, ఏం తినాలో అన్న విషయం బీజేపీ నిర్ణయించడంపై వారు మండిపడ్డారు.
ఇక, ఇప్పటి వరకు ఇటువంటి రాజకీయ పరమైన విషయాలపై స్పందించని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా హిందీ వివాదంపై రియాక్ట్ అయ్యారు. తమిళభాష అద్భుతమైనదంటూ పరోక్షంగా రెహమాన్ కౌంటర్ వేయడం చర్చనీయాంశమైంది. తమిళ దేవత గా భావించే తమిళనాంగు అనే ఒక దేవత పెయింటింగ్ ను తన ట్విటర్, ఇన్ స్టా, ఫేస్ బుక్ ఖాతాలో రెహమాన్ పోస్ట్ చేశారు. లెజెండరీ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ కంపోజ్ చేయగా మనోమణియమ్ సుందరం పిళ్లై రాసిన తమిళ జాతీయ గీతంలోని ఒక వాక్యాన్ని కూడా ఆ ఫొటోపై ఉంచారు ఏఆర్ రెహమాన్. దీంతో, అమిత్ షాకు ‘బొమ్మ’ చూపించిన ఏఆర్ రెహమాన్…అంటూ ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక, బీజేపీ అంటే భగ్గుమనే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా షా కామెంట్లపై స్పందించారు. తాము హిందీ ఎక్కడ మాట్లాడాలో, హిందీ ఎక్కడ నేర్చుకోవాలని షా కోరుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నామని చురకలంటించారు. “మిస్టర్ హోమ్ మినిస్టర్… హోమ్స్ ను బ్రేక్ చేయొద్దు…హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయొద్దు… మా భిన్నత్వాన్ని మేం ప్రేమిస్తాం, మా మాతృభాషను మేం ప్రేమిస్తాం… మా ఆస్తిత్వాలను మేం ప్రేమిస్తాం…” అంటూ కుండబద్దలు కొట్టారు ప్రకాష్ రాజ్.
కాగా, షా కామెంట్లపై మంత్రి కేటీఆర్ కూడా మండిపడ్డ సంగతి తెలిసిందే. ఇది ‘దేశ భిన్నత్వంపై దాడి’ అని, భారతదేశం ఓ వసుదైక కుటుంబమని కేటీఆర్ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే మన బలం అని, అటువంటి దేశంలోని ప్రజలు ఏమి తినాలో, ఏమి ధరించాలో, ఎవరిని ప్రార్థించాలో, ఏ భాషా మాట్లాడాలో ప్రజల నిర్ణయాలకే వదిలేయాలని కేటీఆర్ సూచించారు. భాషా దురాభిమానం, ఆధిపత్యం చెలాయించడం వంటివి బూమరాంగ్ అవుతాయని షాకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.