ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విటర్ ఖాతాను ఆ సంస్థ లాక్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ నియమనిబంధనలు పాటించలేదంటూ రాహుల్ గాంధీతోపాటు, కాంగ్రెస్ పార్టీ, చాలామంది కాంగ్రెస్ నేతల ట్విట్టర్ ఖాతాలను ట్విటర్ ఇండియా లాక్ చేసింది. ఈ నేపథ్యంలో ట్విటర్ ఇండియాపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ట్విట్టర్ ఇండియా పూర్తిగా బీజేపీ కంట్రోల్లో ఉందని, ఆర్ఎస్ఎస్ ఆదేశాలతో పనిచేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో బీజేపీ నేతలు సున్నితమైన అంశాలను పోస్ట్ చేశారని, అవి ట్విట్టర్ గైడ్‌లైన్స్‌లోకి రావా? అని మండిపడుతున్నారు. కొందరైతే ట్విట్టర్ పిట్టకు కాషాయం రంగు పూసి, ‘సంఘీ ట్విట్టర్’ అంటూ విమర్శిస్తున్నారు. ‘ట్విట్టర్ మోదీ సే డర్ గయా’ (మోదీకి ట్విట్టర్ భయపడింది) అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. ట్విట్టర్ మోదీ ప్రభుత్వ నియమాలు పాటిస్తోందా? అని ప్రియాంకా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేతలు షేర్ చేసిన ఫొటోలనే సుప్రీంకోర్టు కమిషన్ షేర్ చేసిందని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాహుల్, కాంగ్రెస్ ఖాతాలకు లాక్ వేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని, ప్రజాస్వామ్య అణచివేతకు బీజేపీతో ట్విట్టర్ జతకట్టిందని ఆరోపించారు.
ఢిల్లీలో అత్యాచారం జరిగిన ఓ చిన్నారితో రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతె. ట్విట్టర్ గైడ్‌లైన్స్‌ను రాహుల్ అతిక్రమించారంటూ ఆయన ఖాతాకు ట్విట్టర్ ఇండియా ఆగస్టు 6న లాక్ వేసింది. దీంతోపాటు, కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతా, కాంగ్రెస్ నేతల, కార్యకర్తల ఖాతాలకూ లాక్ వేశారు. అయితే, లాక్ వేసిన వాటిలో వెరిఫైడ్ ఖాతాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దీంతో, ట్విట్టర్ ఇండియాపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.