జిల్లా ఏదైనా.. గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలు.. పట్టు పెంచుకునేందుకు అవకాశం ఉన్న నియోజకవర్గాలు.. టీడీపీకి చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనూ టీడీపీకి అనేక అవకాశాలు ఉన్నాయి. కీలక నేతలు చాలా మందే టీడీపీకి ఇక్కడ ఉన్నారు. అయితే.. సరైన విధంగా పార్టీని నడిపించడం లేదనే వాదన బలంగా వినిపి స్తోంది.
సరే.. విషయంలోకి వెళ్తే.. కడప జిల్లాలోని బద్వేల్ ఎస్సీ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నిక రానుంది. ఇక్కడ నుంచి గత 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం దక్కించుకున్న వెంకటసుబ్బయ్య.. అనారోగ్య కారణంగా.. ఇటీవల మృతి చెందారు.
ఈ క్రమంలో త్వరలోనే ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక విషయంలో టీడీపీ దూకుడు చూపించింది. ఇక్కడ ఎంపీ అభ్యర్థి మరణించిన తర్వాత.. ఇంకా ఎన్నికల ఊసు కూడా లేనప్పుడే.. పనబాక లక్ష్మిని చంద్రబాబు ప్రకటించారు.
మరి.. బద్వేల్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు చంద్రబాబు ఊసెత్తలేదు. అంటే.. దీనిని లైట్ తీసుకుంటున్నారా? లేక.. సీఎం జగన్ సొంత జిల్లా కాబట్టి.. గెలవడం.. కష్టమని అనుకుని.. ముందుగానే చేతులు ఎత్తేస్తున్నారా? అనే సందేహాలు వస్తున్నాయి. వాస్తవానికి బద్వేల్లో టీడీపీకి వరుస విజయాలు దక్కిన హిస్టరీ ఉంది.
1985, 1994, 1999 వరుస ఎన్నికల్లో బిజివేముల వీరారెడ్డి టీడీపీ తరఫున ఇక్కడ నుంచి విజయం దక్కించుకుని పార్టీని అభివృద్ధి చేశారు.ఆ తర్వాత.. ఇక్కడ టీడీపీ పట్టున్నా.. సడలిపోయేలా వ్యవహరించింది. తర్వాత జరిగిన ఏ ఎన్నికలోనూ.. టీడీపీ ఒక్కరికే నికరంగా టికెట్ ఇచ్చిన సందర్భం మనకు కనిపించదు.
2004లో కోనిరెడ్డి విజయమ్మ, 2009లో లక్కినేని చిన్నయ్య, 2014లో ఎన్ డీ విజయజ్యోతి, 2019లో ఓబులాపురం రాజశేఖర్లకు చంద్రబాబు టికెట్లు కేటాయించారు. ఇది పార్టీని వ్యవస్థీకృతంగా దెబ్బకొట్టింది. ఎవరో చెప్పిన మాటలు విని.. చంద్రబాబు ఇక్కడ టికెట్లు కేటాయిస్తున్నారనే వాదన గత ఎన్నికల సమయంలో బాహాటంగానే వినిపించింది.
ఇక, ఇప్పుడు పరిస్థితిని గమనిస్తే.. తిరుపతి ఉప ఎన్నికలో వ్యవహరించిన వ్యూహాన్ని చంద్రబాబు బద్వేల్ ఉప ఎన్నికలోనూ వ్యవహరిస్తే.. గెలుపు గుర్రం ఎక్కడం పెద్ద కష్టం కాదని.. అంటున్నారు పరిశీలకులు. అదేసమయంలో నిలకడైన నేతలకు, ఇక్కడి ప్రజలను ఆకర్షించగల నేతలను ఆయన ఎంపిక చేయాలనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. అంతేకాదు.. ఇప్పటి నుంచే చంద్రబాబు తన వ్యూహానికి పదును పెడితే ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు. మరి ఇప్పటికైనా స్పందిస్తారో లేదో చూడాలి.