ప్రధాని నరేంద్ర మోడీ నిర్లక్షంతోనే భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేసిందని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. బెంగాల్ ఎన్నికలపూ మోడీ ఫోకస్ చేశారని, అందుకే కరోనా కట్టడిని గాలికి వదిలేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అంతేకాదు, బెంగాల్ ఓటర్లను ఆకట్టుకునేందుకు కావాలనే ప్రధాని గడ్డం పెంచుతున్నారంటూ దీదీ విమర్శలు గుప్పించారు. గడ్డం పెంచుకున్నవాళ్లంతా రవీంద్రనాథ్ ఠాకూర్ కాలేరని దీదీ ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మోడీ గడ్డం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
గడ్డం గీసుకోవాలని కోరుతూ ప్రధాని మోడీకి మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి రూ.100 పంపించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రూ.100 మనీ ఆర్డర్ చేయడంతోపాటు ప్రధానికి ఆ వ్యక్తి రాసిన లేఖ, ఆ లేఖలోని అంశాలు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. మహారాష్ట్ర బారామతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదురుగా టీ స్టాల్ నడుపుతున్న అనిల్ మోరే అనే వ్యక్తి…ప్రధాని మోడీకి లేఖ రాశారు. కరోనా, లాక్డౌన్లపై తన అసంతృప్తిని ఆ లేఖలో తెలియజేశాడు. ప్రధాని మోడీ గడ్డం పెంచుతున్నారని, కానీ, ఆయన ఇకపై ఏదైనా పెంచాలనుకుంటే, అది ఈ దేశ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఉండాలని సూచించాడు.
దేశంలో వీలైనంత వేగంగా వ్యాక్సిన్ వేయించడం కోసం ఏదైనా పెంచితే బాగుంటుందని, కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లాక్డౌన్లతో కలిగిన కష్టాల నుంచి ప్రజలను బయటపడేయడంపై మోడీ దృష్టి పెట్టాలని లేఖలో కోరాడు. ఆ లేఖతోపాటు తాను దాచుకున్న డబ్బుల్లో నుంచి వంద రూపాయాలు మోడీకి పంపుతున్నానని, దానితో ఆయన గడ్డం గీయించుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నాడు. అయితే, తనకు ప్రధాని మోడీ అంటే ఎంతో గౌరవం, అభిమానం అని, ప్రధాని మోడీని అవమానించడం, బాధపెట్టడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. కరోనాతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయనకు తెలియజేయడమే తన ఉద్దేశమన్నాడు. ఏది ఏమైనా, చాయ్ వాలా ప్రధానికి చాయ్ వాలా లేఖ రాయడం, డబ్బులు పంపడం ఇపుడు వైరల్ అయ్యాయి.