భారత్లో కరోనా మహమ్మారి సునామీలా విరుచుకుపడుతోంది. కొత్త కొత్త మ్యుటెంట్లతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే రోజుకు మూడున్నర లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా భారత్ లో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4,12,262 కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటలలో 3,980 మంది కరోనాతో మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 2,30,168 కు చేరుకుంది.
మరోవైపు, ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. గత 24 గంటల్లో ఏకంగా 22,204 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 83 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం 8,374 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. 18 గంటల పాటు కర్ఫ్యూ విధించినా కేసుల సంఖ్య తగ్గకపోవడం గమనార్హం.
ఇక, తెలంగాణలో గడచిన 24 గంటల్లో 6,026 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1,115 మందికి కరోనా సోకింది. ఒక్కరోజులోనే 52 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 2,579కు చేరుకుంది. రోజుకు కనీసం లక్ష కరోనా టెస్టులు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే.