వివాదాస్పద వైఖరితో జగన్ ప్రభుత్వంలో వివాదాస్పద అధికారిగా పేరున్న సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై వేటు వేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కూటమి సర్కారు కొలువు తీరిన తర్వాత ఐపీఎస్ స్థాయిలో ఉన్న అధికారిపై వేటు వేయటం ఇదే మొదటిదిగా చెప్పొచ్చు. చంద్రబాబు ప్రభుత్వంలో సునీల్ కుమార్ పై చర్యలు పక్కాగా ఉంటాయన్న అంచనాలు తెలిసిందే.
ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లటంతో పాటు.. ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరిస్తున్న రఘరామ క్రష్టరాజును అరెస్టు వేళ.. అక్రమపద్దతిలో హింసకు గురి చేసినట్లుగా ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా 2020 – 2024 మధ్య ప్రభుత్వ అనుమతి లేకుండా పలుమార్లు విదేశాలకు వెళ్లటం ద్వారా ఆలిండియా సర్వీసు నిబంధనలను సునీల్ కుమార్ ఉల్లంగించినట్లుగా ఫిర్యాదులు ఉన్నాయి.
ఈ తీరుపై గతంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆధ్వర్యంలో విచారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ సర్కారు తీసుకున్న తాజా చర్యల నేపథ్యంలో కొత్త చర్చ మొదలైంది. ఆయనపై ఉన్న అభియోగాలకు సంబంధించిన చర్యలు వెనువెంటనే ఉంటాయని.. ఆయన అరెస్టు అవుతారన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. రానున్న కొద్ది రోజుల్లో ఆ దిశగా అడుగులు పడతాయన్న మాట బలంగా వినిపిస్తోంది.