ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాజాగా మంత్రలకు క్లాస్ పీకారు. గురువారం అమరావతిలోని ఏపీ సచివాలయంలో మంత్రిమండలి సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మొత్తం 21 అంశాలపై చర్చ జరిగింది. రాజధాని అమరావతి నిర్మాణం, జల్జీవన్ మిషన్ తో పాటు పలు అంశాలపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదే సమావేశంలో పలువురు మంత్రుల పనితీరు పట్ల చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. వారందర్నీ సున్నితంగా మందలించారు.
మంత్రులు ఎవరెవరు ఎలా పని చేస్తున్నారో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని.. తనవద్ద అందరి జాతకాలు ఉన్నాయని ముఖ్యమంత్రి హెచ్చరించారు. సచివాలయానికి, క్యాంప్ కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలోనూ మంత్రులు పర్యటించాలని.. ఇన్చార్జులుగా ఉన్న జిల్లాల్లో మూడు పార్టీల మధ్య సమన్వయం బాధ్యతలను తీసుకోవాలని సూచించారు.
కొందరు దస్త్రాల పరిష్కారంలో జాప్యం చేస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించడం లేదు అంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. తమ శాఖల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేయడంలో శ్రద్ధ చూపడం లేదని మండిపడ్డారు. 6 నెలల పనితీరుపై నివేదిక కోరితే మంత్రులు రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్, సంధ్యారాణి మినహా ఇంకెవ్వరూ నివేదిక సమర్పించలేదన్నారు. ఇకనైనా వేగం పెంచాలని.. ఎవరి శాఖల్లో వారు కిందిస్థాయి వరకు దస్త్రాలను వేగంగా క్లియర్ అయ్యేలా చొరవ చూపాలని మంత్రులకు చంద్రబాబు స్పష్టం చేశారు.
జిల్లాల్లో ప్రధాన సంఘనలపై వెంటనే స్పందించాలని, డీఆర్సీ సమావేశాలను సక్రమంగా నిర్వహించాలని, పొలిటికల్ సమస్యలను సాల్వ్ చేయడానికి బాధ్యత తీసుకోవాలని, విపక్షాల దుష్ప్రచారాలను సమర్ధవంతంగా తిప్పుకొట్టాలని చంద్రబాబు మంత్రులందరికీ హితబోధ చేశారు. మంత్రుల పనితీరుపై ఐవీఆర్ఎస్ సర్వే చేస్తుందని.. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సీఎం సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు.