సార్వత్రిక ఎన్నికలు ముగిశాక వైసీపీ నుంచి వలసల పర్వం ఊపందుకుంది. పార్టీలో ఉన్న కీలక నేతలంలా పక్క చూపులు చూస్తున్నారు. ఈ జాబితాలో ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని కూడా చేరారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగడమే కాకుండా జగన్ ప్రభుత్వంగా ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా రాణించిన ఆళ్ల నాని రెండు నెలల క్రితం వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
అప్పటి నుంచి సైలెంట్ ఉన్న ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో లేరు. జనసేనలోకి వెళ్తారని భావించినప్పటికీ.. చివరికి టీడీపీ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. నేడు సచివాలయంలో జరిగే కేబినెట్ మీటింగ్ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని పసుపు కండువా కప్పుకోబోతున్నారు. ఇందుకు అన్ని రూట్లను ఆయన క్లియర్ చేసుకున్నారని అంటున్నారు.
అయితే ఆళ్ల నాని చేరిక పట్ల ఏలూరు నియోజకవర్గ టీడీపీ నేతలు తీవ్ర ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని అణగదొక్కేందుకు ఆళ్ల నాని చేయని ప్రయత్నం లేదని.. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలా పార్టీలోకి వస్తారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేష్ లను సోషల్ మీడియాలో వైసీపీ నేతలు దారుణంగా అల్లరి చేశారని, వ్యక్తిగత దూషణకు దిగారని మండిపడ్డారు.
కార్యకర్తలను ప్రేరేపించి వారి చేత కించపరిచేలా ఆళ్ల నాని పోస్టులు పెట్టించారని.. అందుకు సంబంధించి తమ వద్ద రికార్డులు కూడా ఉన్నాయంటున్నారు. ఆళ్ల నాని పార్టీలో చేరితే టీడీపీ కార్యకర్తలు క్షమాపణలు చెప్పి రావాలని కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. మరి ఏ విషయంపై ఆళ్ల నాని ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి.