ఏపీ చరిత్రలోనే అతి తక్కువ ధరకు సెకితో విద్యుత్ ఒప్పందం చేసుకుంటే తనను శాలువాతో సత్కరించాల్సింది పోయి బురద జల్లుతున్నాంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే విద్యుత్ రంగంపై అవగాహన ఉన్న వారందరూ జగన్ ఆవేదనలో అర్థంలేదని తేల్చేస్తున్నారు. అవినీతి ఒప్పందానికి జగన్ అడ్డగోలుగా సమర్థించుకుంటున్నారని మండిపడుతున్నారు. తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సైతం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణంలో అదానీ కంపెనీల నుంచి జగన్ కు రూ. 1,750 కోట్ల ముడుపులు ముట్టాయని… ఈ విషయాన్ని అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) స్పష్టం చేసిందని యనమల అన్నారు. జగన్ స్కామ్ ను సాక్షి పత్రిక మినహా జాతీయ, అంతర్జాతీయ పత్రికలన్నీ ప్రచురించాయని యనమల ఎద్దేవా చేశారు.
ప్రపంచమంతా గుర్తించిన జగన్ మాత్రం తాను ఏ నేరం చేయలేదని ఖండించడం విడ్డూరంగా ఉందన్నారు. తప్పు చేయకపోతే ఎఫ్బీఐ, జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలపై ఎందుకు దావా వేయడం లేదని యనమల ప్రశ్నించారు. ప్రజా డిమాండ్ మేరకు జగన్ చేసిన రూ.1,750 కోట్ల అవినీతిపై ఏసీబీ విచారణ జరిపించాలని యనమల డిమాండ్ చేశారు.