రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఈ రోజు పొడిగిన నోళ్లే.. రేపు తెగడ వచ్చు. ఈ రోజు తిట్టిన వారే రేపు పొగడ్తల వర్సం కురిపించనూ వచ్చు. రాజకీయ నాయకులే కాదు.. వ్యాపారులు, కార్పొరేట్ సంస్థలు కూడా ఇలానే ఉన్నాయి. తాజాగా ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబం వ్యవహరించిన తీరు కూడా ఇలానే ఉందన్న విమర్శలు వస్తున్నాయి. హీరో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు తాజాగా మంత్రి నారా లోకేష్‌ను కలుసుకున్నారు.
ఆయనతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. అం తేకాదు.. ఈ సందర్భంగా.. `మా అన్న` అంటూ నారా లోకేష్‌ను విష్ణు పొగడ్తలతో ముంచెత్తారు. విద్యా శాఖ మంత్రిగా ఆయన విద్యారంగాన్ని పరుగులుపెట్టిస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికి నారా లోకేష్‌ను అయితే ఆకాశానికి ఎత్తేశారు. కానీ, ఐదేళ్ల కిందటకు వెళ్తే.. ఇదే మంచు ఫ్యామిలీ.. తిరుపతిలో అప్పటి చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగింది.
ఈ ప్రభుత్వంలో ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేదని మంచు మోహన్‌బాబు విమర్శలు గుప్పించారు. ధర్నాలు కూడా చేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఆయన కుమారుడు నారా లోకేష్‌ను కలిసి పొగడ్తలు కురిపించారు. ఈ పరిణామాలు.. రాజకీయంగా ఆసక్తిగా మారాయి. అయితే..ఈ మొత్తం వ్యవహారానికి కారణం.. మంచు ఫ్యామిలీ నిర్వహిస్తున్న `శ్రీ విద్య` ఎడ్యుకేషన్ సంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు వందల కోట్లలో పెండింగు ఉన్నాయి.
ఈ సొమ్ముల కోసమే వారు ఈ పొగడ్తల పాలిటిక్స్‌ను ఎంచుకున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీల కులు. ఎవరు అధికారంలో ఉంటే వారిని పొగడడం, వారు తమకు అనుకూలంగా ఉంటే ఒకరకంగా.. లేకపోతే.. మరో విధంగా వ్యవహరించడం మంచు ఫ్యామిలీకి వెన్నతో పెట్టిన విద్య అని కామెంట్లు వస్తున్నాయి. కాగా.. మంచు మోహన్‌బాబు రాకుండా.. ఆయన తన కుమారుడిని పంపించడం వెనుక కూడా మొహం చెల్లలేదన్న వాదనా వినిపిస్తోంది. మొత్తానికి మంచు రాజకీయాలపై సోషల్ మీడియాలో కామెంట్లు అయితే పడుతున్నాయి.