ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు గట్టిగా క్లాస్ పీకిన సంగతి తెలిసిందే. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల సభ్యత్వలు నమోదు చేయించడంలో వాసంశెట్టి వెనుకబడి ఉండటంతో సీఎం సీరియస్ అయ్యారు. పార్టీకి ఉపయోగపడకపోతే మీకు రాజకీయాలెందుకయ్యా..? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. మొదటిసారి గెలిచిన మీకు పార్టీ ఎంతో గౌరవించింది.. ఎమ్మెల్యే సీటు ఇచ్చి, గెలిచాక మంత్రి పదవి ఇచ్చింది.. అయినా కూడా రాజకీయాలపై సీరియస్నెస్ లేకపోతే ఎలా..? అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు.
నేను మీపై ఒత్తిడి చేస్తున్నాననుకోవద్దు. మీరు సరిగ్గా పనిచేయకపోతే నేను ప్రత్యామ్నాయం చూసుకుంటాను అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. విపక్షంలో ఉన్న వైసీపీ వాసంశెట్టిపై ట్రోలింగ్ షురూ చేసింది. అయితే చంద్రబాబు క్లాస్ పీకడంపై వాసంశెట్టి తాజాగా స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యల విషయంలో తప్పు లేదన్న ధోరణిలోనే యువ మంత్రి రియాక్ట్ అయ్యారు.
తన అలసత్వం వల్ల తప్పు జరగడం వల్లే సీఎం చంద్రబాబు ఓ తండ్రిలా వ్యవహరించి తనను మందలించారని.. ఇందులో అపార్థాలకు తావు లేదని వాసంశెట్టి పేర్కొన్నారు. ఓ టీచర్ విద్యార్థిని మందలించినా, కొట్టినా అది వారి శ్రేయస్సు కోసమేనని.. ఇది కూడా అలాంటి ఘటనేనన్నారు. ప్రతిపక్షాలే దీనిని వేరే కోణంలో చూస్తున్నాయని.. కానీ ప్రత్యర్థుల ఏడుపులు తనకు దీవెనలు అవుతాయని వాసంశెట్టి అన్నారు. చంద్రబాబు మందలించిన ఆడియోతో తనను తెగ ట్రోల్ చేశారని.. దాని వల్ల తనకు మంచే జరిగిందన్నారు.
వైసీపీ, ఓ వర్గం మీడియా తనకు ఫ్రీగా పబ్లిసిటీ చేసి పెట్టారు.. దాంతో పట్టభద్రుల ఓట్ల నమోదు 26 శాతం నుంచి 41 శాతానికి పెరిగిందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. చంద్రబాబు పార్టీ విషయాల్లో చాలా స్పష్టంగా ఉంటారని.. ఆయన్ను తాను ఒక తండ్రిలా భావిస్తానని.. ఇకపై బాధ్యతగా వ్యవహరిస్తానని వాసంశెట్టి పేర్కొన్నారు.