అమెరికాలోని లాస్ వెగాస్ లో జరుగుతున్న ‘‘ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్-2024’’లో ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈఓ క్లారా షిహ్‌తో లోకేష్ భేటీ అయ్యారు. స్మార్ట్ గవర్నెన్స్, ఏఐ డ్రైవెన్ ఎకానమీపై ఏపీ ప్రభుత్వం దృష్టిసారించిందని, ఏపీలో ఏఐ స్కిల్లింగ్ కార్యక్రమాల ప్రారంభానికి సహకరించాలని కోరారు. ఏపీలో ఏఐ ఆధారిత పరిశ్రమల కోసం యువతకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇవ్వాలని, సేల్స్‌ఫోర్స్ ఏఐ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు, ప్రయోగాత్మక శిక్షణను అందించేందుకు విద్యా సంస్థలతో భాగస్వాములు కావాలని కోరారు. ఏపీ టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసేందుకు స్థానిక స్టార్టప్‌లకు ఏఐ టూల్స్, మెంటార్షిప్ను అందించాలని లోకేష్ విజ్నప్తి చేశారు.
ప్రభుత్వ సేవల్లో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం)ని మెరుగుపరిచేందుకు సేల్స్‌ఫోర్స్ తాలూకు ‘‘ఐన్‌స్టీన్ ఏఐ’’ని ఏపీకి పరిచయం చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఏఐ-పవర్డ్ ఆటోమేషన్, అనలిటిక్స్ ద్వారా పాలనారంగంలో సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు సహకరించాలని కోరారు. ఏపీలో ఈ-గవర్నెన్స్, ఏఐ-డ్రైవెన్ సొల్యూషన్స్ అమలు, సర్వీస్ డెలివరీ మెకానిజం మెరుగుపర్చడం, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, ఆటోమేటెడ్ ప్రాసెస్ల ద్వారా పబ్లిక్ ఎంగేజ్‌మెంట్‌ను అమలు చేసేందుకు సేల్స్‌ఫోర్స్ సహకారాన్ని కోరారు. పరిపాలనలో ఏఐ, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు.
లోకేష్ ప్రతిపాదనలపై క్లారా షిహ్ సానుకూలంగా స్పందించారు. సేల్స్ ఫోర్స్ ఏఐ వ్యూహ పర్యవేక్షణ, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం)లో ఆఫర్లను మెరుగుపర్చడం, ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ లో సరికొత్త ఆవిష్కరణలపై తాము దృష్టి సారించామని ఆమె తెలిపారు. ఐన్‌స్టీన్ ఏఐ ప్లాట్‌ఫారమ్ అభివృద్ధికి కసరత్తు చేస్తున్నామని, కస్టమర్ మనోభీష్టానికి అనుగుణంగా ప్రిడిక్టివ్ అనలిటిక్స్, వ్యాపార విధుల్లో ఆటోమేషన్ కోసం ఏఐ టూల్స్ రూపొందించడం వంటి సేవలు అందిస్తున్నామన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై తమ సహచర బృందంతో చర్చిస్తామని క్లారా షిష్ వెల్లడించారు.