ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు పార్టీల మధ్య టికెట్ల పంపకాల నేపథ్యంలో చాలామంది కీలక నేతలకు టికెట్లు దక్కలేదు. ఈ క్రమంలోనే మూడు పార్టీలకు చెందిన టికెట్ రాని నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మొదటి విడత 21 నామినేటెడ్ పదవుల భర్తీలో చాలామందికి న్యాయం జరిగింది. ఈ క్రమంలోనే రెండో విడత జాబితాపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు.
ఈ క్రమంలోనే ఈ విషయంపై టీడీపీ కీలక నేతలతో దాదాపు మూడు గంటల పాటు చంద్రబాబు సమావేశమయ్యారు. మొదటి దశలో 21 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన చంద్రబాబు..రెండో విడతలో రెట్టింపు సంఖ్యలో 42 నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రయత్నిస్తున్నారట. కూటమిలోని మిత్ర పక్షాలతో కూడా సంప్రదింపులు జరిపి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. కష్టపడ్డ వారికి పదవులు ఇచ్చేలాగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారట. అన్ని పార్టీల నుంచి, వివిధ మార్గాల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి, విశ్లేషించి చంద్రబాబు ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది.
దీంతోపాటుగా, ఈ నెల 26 నుంచి టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కూడా చంద్రబాబు ఫోకస్ చేశారు. 100 రూపాయల సభ్యత్వంతో 5 లక్షల బీమా సౌకర్యం కల్పించేలాగా ఈ కార్యక్రమాన్ని టిడిపి రూపొందించింది. గతంలో సభ్యత్వ నమోదు విషయంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకొని ముందుకు వెళ్లాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది.