ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. హిందువులకు తిరుమల పవిత్రమైన పుణ్యక్షేత్రం. హిందూయేతరులు ఆలయాన్ని సందర్శించినపుడు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి. ఇది ఎప్పటినుంచో ఉన్న సాంప్రదాయం. అయితే సీఎంగా ఉన్న టైమ్ లో ఈ సంప్రదాయాన్ని జగన్ తుంగలో తొక్కారనే వాదనలు ఉన్నాయి. శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో ఆకస్మికంగా శుక్రవారం జగన్ తిరుమల టూర్ కు సిద్ధమయ్యారు.
ఈసారి జగన్ డిక్లరేషన్ ఫామ్ పై సంతకం చేస్తేనే ఆలయంలోకి అనుమతి ఇవ్వాలని హిందుత్వ సంఘాలు, కూటమి నేతలు డిమాండ్ చేశారు. దీంతో తిరుమల టూర్ ను క్యాన్సిల్ చేసుకున్న మన మాజీ సీఎం.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ అడుగుతారా? మనం ఎలాంటి దేశంలో నివసిస్తున్నాం? ఆలయంలో ప్రవేశించే వ్యక్తి తన మతమేంటో చెప్పాలా? ఇదేం దేశం.. ఇదేం హిందూయిజం..? అంటూ జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు
తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకుంటానంటే మతమేమిటని ఎలా అడుగుతారు అంటూ మండిపడ్డారు. తన మతం మానవత్వమని.. డిక్లరేషన్లో రాసుకోవాలంటూ టీటీడీకి జగన్ సూచించారు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల తాజాగా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు స్పందిస్తూ.. జగన్ కు తనదైన శైలిలో చురకలు వేశారు. తనను అన్యాయంగా చిత్రహింసలకు గురిచేసినప్పుడు జగన్ మతం, మానవత్వం ఎక్కడికి పోయాయని రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు.
శ్రీవారిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇచ్చి దర్శించుకుంటే.. క్రైస్తవుల ఓట్లు తనకు దూరమవుతాయని భయపడే జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారని ఎద్దేవ చేశారు. ఏ మతానికైనా కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయని.. వాటిని ఎవ్వరైనా పాటించాలని రఘురామకృష్ణ రాజు హితవు పలికారు. గతంలో అబ్దుల్ కలాం, సోనియాగాంధీ వంటి వారు శ్రీవారిని దర్శించుకునే ముందు డిక్లరేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలని అధికారులు ఆడిగితే.. వారిని చీదరించుకొని, చెప్పులు వేసుకునే మాడవీధుల్లో తిరిగారని రఘురామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తనను చిత్రహింసలకు గురిచేసిన సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ను తక్షణమే అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.