తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం ఏపీలో పొలిటికల్ గా మారిపోయింది. ఇలాంటి తరుణంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు రెడీ అవ్వడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. శుక్రవారం రాత్రికి జగన్ తిరుమల చేరుకుంటారు. ఈ రాత్రికి తిరుమల గెస్ట్ హౌస్ లోనే బస చేసి శనివారం ఉదయం 10.20 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు.
అయితే జగన్ తిరుమలకు రానున్న నేపథ్యంలో డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. క్రైస్తవుడు అయిన జగన్ అందరు అన్యమతస్తుల మాదిరే శ్రీవేంకటేశ్వరస్వామిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ పై సైన్ చేయాలని హిందుత్వ సంఘాలు, కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. అన్యమతస్తులు శ్రీవారి దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. గతంలో పలువురు ప్రముఖులు, ఇతరమతస్తులు డిక్లరేషన్‌పై సంతకం పెట్టారు.
తిరుమలలో ఆలయ సంప్రదాయాలు, సనాతన ధర్మాన్ని గౌరవించారు. కానీ గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మాత్రం ఈ సంప్రదాయానికి తూట్లు పొడిచారనే వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం మాజీ సీఎం జగన్ తిరుమల దర్శనానికి వెళ్లడాన్ని ఎవరూ వ్యతిరేకించనప్పటికీ.. సంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటున్నారు. సంతకం పెట్టకపోతే జగన్‌ను దర్శనానికి అనుమతించమని.. అలిపిరి దగ్గరే ఆపేస్తామంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు స్వాములు నిన్న అలిపిరి వద్ద ఆందోళనకు దిగారు. గో బ్యాక్ జగన్ అంటూ నిరసన చేపట్టారు.
జగన్ పర్యటన నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. మరోవైపు టీటీడీ జగన్ కోసం డిక్లరేషన్ ఫామ్ ను సిద్ధం చేస్తున్నారు. అయితే జగన్ మాత్రం ఇంత వరకు డిక్లరేషన్ విషయంలో నోరు మెదపలేదు. దీంతో జగన్ డిక్లరేషన్ అంశం ఉత్కంఠ రేపుతోంది. భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో జగన్ ఒక అడుగు వెనక్కి వేసి డిక్లరేషన్ ఇస్తారా..? లేక సంతకం చేయకుండా తిరుమల వెళ్లిన తర్వాత తనను దర్శనానికి అనుమతించలేదని, ఆంక్షలు పెడుతున్నారంటూ కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతారా..? అన్నది చూడాలి.