2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఏ రేంజ్ లో ఓడిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 175 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీకి చివరకు 11 స్థానాలు దక్కాయి. అయితే ఇప్పుడు ఆ 11 స్థానాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు సైతం పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం వైసీపీలో కలకలం రేపుతోంది. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో వైసీపీని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించిన జగన్ లో మార్పు రాలేదని.. ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా పక్క చూపులు చూస్తున్నారని.. కూటమి పార్టీలు గేట్లు ఎత్తితే వైసీపీలో మిగిలేది జగన్ మాత్రమే అని గంటా వ్యాఖ్యానించారు. ఇటీవల వరదల సమయంలో ప్రజలకు కూటమి సర్కార్ అండగా నిలిచిందని.. కానీ జగన్ కావాలని ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
జగన్ మాదిరి లక్షల కోట్ల అక్రమ సంపాదన లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గొప్ప మనసుతో రూ. 4 కోట్లు విరాళం ప్రకటించి వరద బాధితులను ఆదుకున్నారని.. అయినా సరే వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ను విమర్శించడం విడ్డూరంగా ఉందని గంట శ్రీనివాసరావు చురకలు వేశారు. అక్రమంగా కోట్లు సంపాదించిన జగన్.. కోటి రూపాయలతో సరిపెట్టుకున్నాడని.. వరద బాధితులను పట్టించుకోవడం మానేసి జైలు పాలైన పార్టీ నేతలను పరామర్శిస్తున్నారని గంటా ఎద్దేవా చేశారు.