ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ వైసీపీ నేతలు పథకాల అమలు విషయంలో ప్రభుత్వాన్ని పదేపదే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి తరుణంలో వైసీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడి సొంత పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చి రెండు నెలల కూడా కాకముందే పథకాలు అమలు చేయడం లేదంటూ ప్రభుత్వాన్ని విమర్శించడం కరెక్ట్ కాదని కేతిరెడ్డి పేర్కొన్నారు. అద్భుతాలన్నీ స్వల్ప వ్యవధిలోనే జరిగిపోతాయని ఆశించకూడదు.. సంపద సృష్టించిన తర్వాతే పథకాలను ఇస్తామని ఎన్నికల సమయంలో వాళ్లు వాగ్దానం చేశారు.
కాబట్టి ఈ ఏడాది చివరి వరకైనా అవకాశం ఇవ్వాలి.. అప్పటికీ వారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే అప్పుడు ప్రభుత్వంపై ఎలా పోరాటం చేయాలనే అంశంపై కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి హితవు పలికారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ వీడియోను పంచుకుంది. ప్రస్తుతం కేతిరెడ్డి కామెంట్స్ ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. కాగా, గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంతో కేతిరెడ్డి ఎంత పాపులర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిత్యం ప్రజల్లో ఉన్న కేతిరెడ్డి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి హవాకు ఓటమి పాలయ్యారు.