అనూహ్య నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇద్దరు ఇద్దరే అన్నట్లుగా వారి వ్యవహార శైలి కూటమిలోని పార్టీ నేతల్నే కాదు.. తెలుగు వారి మనసుల్ని దోచుకుంటోంది. అధికారంలో లేనప్పుడు సవాలచ్చ మాటలు.. ఆదర్శాలు చెప్పొచ్చు. కానీ.. చేతికి పవర్ వచ్చిన తర్వాత మార్పు సహజంగా వచ్చేస్తుంది. కానీ.. అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇద్దరు అధినేతలు.
ఇంతవరకు అధికారం లేని పవన్ ను మాత్రమే చూసిన ప్రజలకు.. అధికారం చేతికి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న పనులన్ని.. గతంలో ఆయన చెప్పిన ఆదర్శాలకు తగ్గట్లే ఉండటం ఆసక్తికరంగా మారింది. అయితే.. పవన్ కంటే ఎక్కువ సర్ ప్రైజ్ గా మారింది మాత్రం చంద్రబాబు వ్యవహారశైలి. కారణం..దశాబ్దాల తరబడి చంద్రబాబు తీరును చూస్తున్న వారికి ఇప్పుడు ఆయన సరికొత్తగా కనిపిస్తున్నారు.
గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఎన్నికల్లో కీలకంగా ఇచ్చిన హామీని వేగంగా అమలు చేయటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. కేవలం రెండు వారాల సమయంలో ఎన్నికల వేళలో ఇచ్చిన హామీకి తగ్గట్లే పింఛన్ ను రూ.7వేలు ఇవ్వటం.. అది కూడా ఒక రోజులోనే పంపిణీ పూర్తి కావటం ఆసక్తికర చర్చకు తెర తీసింది. అంతేనా.. అంచనాలకు భిన్నంగా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఒక లబ్థిదారుడి ఇంటికి వెళ్లి.. తన చేత్తో స్వయంగా అందజేయటం ఒక ఎత్తు అయితే.. వారింట్లో కూర్చొని.. వారిచ్చిన టీ తాగి మరీ పరామర్శలు చేయటం అందరిని ఆకర్షిస్తోంది.
ఇలాంటి తీరు గతంలో ఉండేది కాదని… ఇప్పుడు మాత్రం ఆయన తీరు భిన్నంగా ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఇక.. పవన్ కల్యాణ్ విషయానికి వస్తే.. జీతం వద్దని చెప్పటం కొత్త కానప్పటికీ.. తన ఆఫీసులో కొత్త ఫర్నీచర్ కు సైతం డబ్బులు ఖర్చు చేయొద్దని.. తనకు అవసరమైన ఫర్నీచర్ ను తానే ఏర్పాటు చేసుకుంటానని అధికారులకు స్పష్టం చేయటం మాత్రం సరికొత్త కల్చర్ గా చెబుతున్నారు.
ఆదర్శ మాటలు ఎన్ని చెప్పినా.. ప్రజాధనాన్ని పప్పు బెల్లాల మాదిరి ఖర్చు చేయటంలో పాలకులు వెనుకా ముందు చూడరు. అందుకు భిన్నంగా పవన్ వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. ఇలాంటి రాజకీయం కదా.. ఇంతకాలం ఎదురు చూసిందన్న మాట వినిపిస్తోంది. ఏపీ రాజకీయం మారాలని.. కొత్త తరహా రాజకీయం ఎప్పటికి సాధ్యమన్న భావనలో ఉన్న తెలుగు వారికి చంద్రబాబు.. పవన్ తీరు చూస్తున్న వేళ.. ఏపీలో తాము కలలు కన్న సరికొత్త రాజకీయం కళ్ల ముందుకు వచ్చినట్లుగా పలువురు భావిస్తున్నారు. ఇదే తీరు ఐదేళ్లు కంటిన్యూ కావాలని కోరుకుంటున్నారు.