ఏపీలో జూలై 1 సోమవారం నాడు పింఛన్ల పండగ జరగబోతోంది. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే వృద్ధుల సామాజిక పింఛన్లను రూ. 4 వేలకు పెంచుతామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయకేతనం ఎగరవేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే పెన్షన్ పెంపు ఫైవ్ పై సంతకం చేసి కేబినెట్ లో తీర్మానం చేశారు.
ఎన్నికల తర్వాత పింఛన్ల పంపిణీ రాష్ట్రంలో నిర్వహించే మొదటి కార్యక్రమం. దీంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపచేస్తానని చంద్రబాబు తెలిపారు. అందుకు అనుగుణంగానే ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయిలు రూ.1000 చొప్పున మొత్తం రూ.3000 కలిపి జూలైలో రూ.7000 చొప్పున లబ్ధిదారులకు అందించబోతున్నారు. ఇందుకు ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది.
గత వైకాపా ప్రభుత్వంలో వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందించేవారు. అయితే కొత్త ప్రభుత్వం ఆ బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు అప్పజెప్పింది. అలాగే జూలై 1వ తేదీన 100 శాతం పింఛన్లు పంపిణీకి ప్రణాళిక కూడా సిద్ధం అయింది. జూన్ 30వ తేదీ ఆదివారం కావడంలో సచివాలయ ఉద్యోగులు శనివారం రోజు బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఫించన్లు పంపిణీలో ఎక్కడా పొరపాట్లు జరగకూడదని ముందే హెచ్చరించారు.
సోమవారం ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ స్టార్ట్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 65,18,496 మంది లబ్ధిదారులు ఉండగా.. రూ.4,408కోట్ల నగదును పంపిణీ చేయబోతున్నారు. లబ్ధిదారులకు పెన్షన్ అమౌంట్‌తో పాటు సీఎం చంద్రబాబు రాసిన లేఖను కూడా అందించేలా చర్యలు తీసుకున్నారు. ఫించన్ల పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు గంట గంటకూ పర్యవేక్షించబోతున్నారు. అలాగే పింఛన్ల పంపిణీలో చంద్రబాబు మరియు ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా భాగం అవ్వాలని డిసైడ్ అయ్యారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో లబ్ధిదారులకు చంద్రబాబు స్వయంగా పెన్షన్ అందించనున్నారు.