ఏపీలో గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పేరుతో బటన్లు నొక్కడం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందేమి లేదు. ఈ విషయాన్ని ముందే గ్రహించిన ఆంధ్రులు ఓటు అన్న ఆయుధంతో వైకాపా ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కి కూటమికి మద్దతు తెలిపారు. గత ఎన్నికల్లో 151 సీట్లతో సంచలన విజయాన్ని సాధించిన వైసీపీ.. ఈసారి కేవలం 11 సీట్లతో చరిత్రలో నిలిచిపోయే పరాజయాన్ని నమోదు చేసింది.
సరైన సంఖ్యా బలం లేకపోవడంతో శాసనసభలో వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయితే కూటమి తర్వాత అత్యధిక సీట్లు సాధించింది వైసీపీనే కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని వైఎస్ జగన్ గట్టిగా పట్టు పట్టారు. ఇందులో భాగంగానే తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి జగన్ లేఖ రాశారు. అలాగే తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో సైతం వైసీపీ పిటిషన్ వేయడంతో ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.
వాస్తవానికి అసెంబ్లీ సీట్లలో 10 శాతం అంటే 18 సీట్లు వైసీపీకి వచ్చుంటే ప్రతిపక్ష హోదా కోసం ఇప్పుడు పాకులాడాల్సిన పరిస్థితి వచ్చేదే కాదు. కానీ ప్రజలు వైసీపీకి 10 శాతం సీట్లు ఇవ్వడానికి కూడా మొగ్గు చూపలేదు. దీంతో ప్రతిపక్ష హోదా వైసీపీకి ఇచ్చేదే లేదంటుంది కూటమి ప్రభుత్వం. అయినా సరే జగన్ వెనక్కి తగ్గడం లేదు. ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందడం కోసం ప్రయత్నిలు చేస్తూనే ఉన్నారు. అయితే ప్రతిపక్ష హోదా విషయంలో మాజీ సీఎం ఇంత గట్టి పట్టు పట్టడం వెనక బలమైన కారణాలే ఉన్నాయి.
లోక్ సభలో అయినా అసెంబ్లీల్లో అయినా అధికార పార్టీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకట్ట వేసేదే ప్రతిపక్షం. ప్రభుత్వ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపడమే ప్రతిపక్షం పని. ఇక ప్రతిపక్ష నేత స్పీకర్ ద్వారా గుర్తింపు పొందితే కొన్ని ప్రత్యేకమైన పవర్స్ వస్తాయి. మంత్రులకు సమానమైన హోదా, గౌవరం ప్రతిపక్ష నేతకు దక్కుతుంది. ప్రోటోకాల్ తో పాటు అలవెన్సులు, జీతాలు ఉంటాయి. అంతేకాదు, అసెంబ్లీ సామావేశాల సమయంలో ప్రతిపక్ష నేతకు ముందు వరుసలో సీటు కేటాయించడమే కాకుండా ఎక్కువసేపు మాట్లాడే అవకాశం కల్పిస్తారు. కమిటీల ఏర్పాటు చేసేటప్పుడు ప్రతిపక్ష నేత అభిప్రాయాన్ని తీసుకుంటారు. ఓ మంత్రి పొందే సౌకర్యాలను, కొన్ని అధికారులు ను ప్రతిపక్ష నేత పొందుతారు. అందుకే రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష నేతగా అయినా ఉండాలని జగన్ ఆశపడుతున్నారు. మరి ఆయన ఆశ నెరవేరుతుందా.. లేదా.. అన్నది చూడాలి.