ఏపీ నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజల రుణ తీర్చుకునేందుకు రెడీ అయ్యారు. చంద్రబాబుకు కుప్పం కంచుకోట అన్న సంగతి తెలిసిందే. 1989లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు తొలిసారి పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కుప్పంలో టీడీపీ జెండా తప్ప మరొక జెండా ఎగరలేదు. వరుసగా ఎనిమిది సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా చంద్రబాబు గెలుపొందారు. కుప్పం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని చంద్రబాబు నిర్వహించక పోయిన ప్రజలు మాత్రం ఆయన వెంటే నడిచారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో బాబును గెలిపించారు. ఈ నేపథ్యంలోనే సీఎం తన సొంత నియోజకవర్గ ప్రజలకు వరాలు కురిపించబోతున్నారు. గత వైకాపా పాలనలో కుంటుపడిన కుప్పం అభివృద్ధిపై చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను కుప్పంకు తీసుకొచ్చేందుకు బ్రాంచ్ కెనాల్ నిర్మాణ పనులను చేపట్టి దాదాపు 85 శాతం వరకు పనులను పూర్తి చేశారు.
కానీ 2019లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలో రావడంతో హంద్రీనీవా ప్రాజెక్ట్ అక్కడే ఆగిపోయింది. దీంతో చంద్రబాబు ఇప్పుడు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు కుప్పంకు తీసుకొచ్చేందుకు నడుం బిగించారు. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు.. పలు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడమే టార్గెట్గా పెట్టుకున్నారు. రాబోయే ఐదేళ్లలో కుప్పం నియోజకవర్గానికి కొత్త రూపు తీసుకురాబోతున్నారు. ఇందులో భాగంగానే సీఎంగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిసారిగా మంగళ, బుధవారాల్లో సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించబోతున్నారు. ఇందుకోసం అధికారులు కుప్పాన్ని ముస్తాబు చేస్తున్నారు.