వైకాపా నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తాజాగా తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చిత్తుచిత్తుగా ఓడిపోతాడని.. ఒకవేళ అలా జరగకపోతే తన పేరు మార్చుకుంటానంటూ శపథం చేశారు. కట్ చేస్తే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో శాసనసభకు ఎన్నిక అవ్వడమే కాకుండా కూటమి అధికారంలోకి వచ్చింది. మంత్రిగా ఉపముఖ్యమంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు.
ఇక శపథం ప్రకారం ముద్రగడ తన ఓటమిని అంగీకరించి పేరును మార్చుకున్నారు. అక్కడితో ఆగని ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని పదేపదే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముద్రగడకు కన్నా కూతురు క్రాంతి చివాట్లు పెట్టింది. ముద్రగడ పేరు మార్చుకోవడం పట్ల ఆమె తాజాగా ఎక్స్ ద్వారా స్పందించారు.
మా నాన్న ముద్రగడ పద్మనాభం ఇటీవల తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. పేరు మారిన ఆయన ఆలోచన విధానం మాత్రం మారకపోవడం ఆందోళనగా ఉందని క్రాంతి చెప్పుకొచ్చారు. జగన్ ఏం చేసినా మాట్లాడని ఆయనకు పవన్ కళ్యాణ్ ను విమర్శించే హక్కు, ప్రశ్నించే హక్కు ఉందా అంటూ నిలదీశారు.
సమాజానికి ఏం చేయాలో పవన్ కళ్యాణ్ కు స్పష్టమైన అవగాహన ఉందని.. జగన్ కు అలాంటిదేమీ లేకపోవడం వల్లే ప్రజలు కూటమికి బ్రహ్మరథం పట్టారని క్రాంతి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసే ఆలోచన తన తండ్రికి లేదనిపిస్తోందని.. ఇకనైనా శేష జీవితాన్ని ఆయన ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలంటూ క్రాంతి ఎక్స్ లో ట్వీట్ చేశారు.