ఏపీలో ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ పథకాల్లో ఇది కూడా ఒకటి. అయితే ఇటీవల ఎన్నికలు ముగిశాయి. కూటమి గ్రాండ్ విక్టరీ సాధించి అధికారంలోకి వచ్చింది. ఏపీ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు.. అన్నా క్యాంటిన్ల రీఎంట్రీకి కసరత్తులు స్టార్ట్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశారు. ఇలా ఇచ్చిన హామీలు అమలు చేస్తూ బాబు యమా దూకుడు చూపిస్తున్నారు. అయితే ఇంత వరకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం అమలపై క్లారిటీ రాలేదు. ఇది ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని మహిళా ఓటర్లు ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి తరుణంలో ఏపీ మహిళలకు తీపి కబురు అందింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీపై కీలక అప్డేట్ వచ్చింది. ఏపీ రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి తాజాగా ఈ విషయంపై స్పందించారు. మరో నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ఆ దిశగా చంద్రబాబు నాయుడు కసరత్తులు ప్రారంభించారని.. 15 రోజుల్లోగా కమిటీని ఏర్పాటు చేయనున్నారని తెలిపారు.
కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదని.. కానీ తమ ప్రభుత్వంలో ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తామని, దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల సంఖ్యను పెంచుతామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.