ఏపీలో గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారంటూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారులను చంద్రబాబు సర్కారు బదిలీ చేసింది. గత రెండు రోజులుగా ప్రధాన మీడియాలో వస్తున్న వార్తలతోపాటు.. పార్టీ నాయకుల నుంచి కూడా వస్తున్న విన్నపాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆచి తూచి అడుగులు వేశారు. మొత్తం 19 మంది కీలక శాఖల ఉన్నతాధికారులుగా పాతుకు పోయిన ఐఏఎస్‌లను ఆయన బదిలీ చేశారు.
+ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మిని జనలర్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్(జీఏడీ)కి అటాచ్ చేశారు.
+ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవను కూడా జీఏడీకి అటాచ్ చేశారు.
+ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, మాజీ సీఎం జగన్ కు అత్యంత విధేయుడైన అధికారి ప్రవీణ్ ప్రకాశ్ ను కూడా జీఏడీకి అటాచ్ చేశారు.
+ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ కుమార్, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్, కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ గా సిద్ధార్థ్ జైన్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్ లను బదిలీ చేశారు.
+ అదేవిధంగా నైపుణ్యాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శిగా సౌరభ్ గౌర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్, ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా కోన శశిధర్ కు పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శిగా బాబు.ఎ, ఏపీ సీఆర్డీఏ కమిషనర్ గా కాటమనేని భాస్కర్, ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్నలను నియమించారు.
+ ఆర్థికశాఖ వ్యయ విభాగం కార్యదర్శిగా ఎం.జానకి, పశుసంవర్థకశాఖ కార్యదర్శిగా ఎం.ఎం.నాయక్, గనులశాఖ కమిషనర్, డైరెక్టర్ గా తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఏపీఎండీసీ ఎండీగా ప్రవీణ్ కుమార్ కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. తిరుపతి జేసీకి జిల్లా కలెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. జీఏడీకి రిపోర్ట్ చేయాలని మురళీధర్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఆర్థికశాఖ కార్యదర్శిగా ఉన్న సత్యనారాయణను పక్కన పెట్టి ఈ ప్లేస్‌లో వి.వినయ్ చంద్ ను నియమించారు.