ఆంధ్రాలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి బ్రేకులు వేసి ఎన్డీఏ కూటమి గ్రాండ్ విక్టరీని సాధించింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగో సారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అధికారం అలా చేపట్టారో లేదో.. ఇలా వెంటనే హామీల అమలకు ప్రాధాన్యత ఇస్తూ చంద్రబాబు వేగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పేదల కడుపు నింపేందుకు శ్రీకారం చుట్టారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చే సామాన్యులు, పట్టణాల్లో ఉండే పేదలకు రూ.5కే టిఫిన్, భోజనం అందించాలనే మహోన్నత ఆశయంతో ఏపీ వ్యాప్తంగా 184 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు.
రూ.5కే రుచికరమైన, నాణ్యమైన భోజనం దొరకడంతో అన్న క్యాంటీన్లు అనతి కాలంలోనే ప్రజలకు చేరువయ్యాయి. కానీ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. రోజుకు దాదాపు 2.25 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా 7.25 కోట్ల మంది ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లను కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వైకాపా ప్రభుత్వం తొలగించింది. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అయ్యారు.
పేదవారికి పట్టడన్నం పెట్టాలనే లక్ష్యంతో తాను తొలిసారిగా చేసిన ఐదు సంతకాల్లో అన్నా క్యాంటీన్ల పునరుద్దరణ ఫైల్ ను కూడా చేర్చారు. ఇదే విషయాన్ని తాజాగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మీడియాతో తెలిపారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో అన్న క్యాంటీన్ల పునరుద్దరణపై మున్సిఫల్ అధికారులతో చర్చలు జరిపిన నారాయణ.. ఆపై మీడియాతో మాట్లాడారు. మరో మూడు వారాల్లో అన్న క్యాంటీన్లు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపారు.
గతంలో మాదిరిగానే ఈసారి కూడా నిరుపేదలకు రూ.5కే ఉదయం టిఫిన్, రూ.5కే మధ్యాహ్న భోజనం, రూ.5కే రాత్రి భోజనం అందజేయబోతున్నట్లు వెల్లడించారు. కాగా, గత టీడీపీ హయాంలో మొత్తం 4 కోట్లు 60 లక్షల 31 వేల 600 ప్లేట్ల భోజనాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా పంపిణీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అప్పట్లో అన్నా క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను ఇస్కాన్ ఆధ్యాత్మిక సంస్థ చూసుకునేది. ఇప్పుడు కూడా ఈ సంస్థకే బాధ్యతలు ఇవ్వబోతున్నారు.