సార్వత్రిక ఎన్నికల ప్రచారం తుది దశ గురువారం సాయంత్రంతో ముగియనుంది. ఏడు దశల్లో జరుగు తున్న ఈ ఎన్నికలకు సంబంధించిన తుది విడత పోలింగ్ జూన్ 1న(శనివారం) జరగనుంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రంతో ఈ ప్రచారానికి బ్రేక్ పడనుంది. మొత్తం 543 పార్లమెంటు స్థానాల ఫలితం జూన్ 4న తెలియనుంది. అయితే.. ఈ ఏడు దశల ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.
57 రోజుల పాటు నిర్విరామంగా ప్రచారం చేసిన నరేంద్ర మోడీ ఉత్తరాది రాష్ట్రాలపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్, ఒడిశాలపైనా ఆశాలుఉంచారు. మొత్తం 180 సభల్లో పాల్గొన్న మోడీ.. నాలుగు రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఉత్తర ప్రదేశ్(80 సీట్లు), బిహార్, మహారాష్ట్ర, కర్ణాటకలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి ప్రచారం చేశారు. అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో 88 ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. వీటితోపాటు పశ్చిమ బెంగాల్ లో 18 ప్రచార సభలు.. ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో 35 సభలు.. కర్ణాటక, తెలంగాణలో 11 సభల్లో మోడీ పాల్గొన్నారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగియనుండడంతో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇక, ధ్యాన మార్గంపట్టనున్నారు. గురువారం సాయంత్రం తమిళనాడుకు ఆయన చేరుకుంటారు. మూడు రోజుల పాటు ఆయన ఇక్కడే బస చేయనున్నారు. తిరువనంతపురం నుంచి తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకుంటారు. నేరుగా స్వామి వివేకానంద రాక్ మెమోరియల్‌కు వెళ్తారు. అనంతరం శ్రీపాద మండపంలో భగవతి అమ్మవారి పాదముద్రలకు పుష్పాభిషేకం చేస్తారు.
అనంతరం స్మారక మండపంలో ఉన్న ధ్యానమందిరంలో ధ్యానంలో నిమగ్నమవుతారు. జూన్ 1వ తేదీ సాయంత్రం వరకూ అక్కడే ధ్యానం, బస చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధాని రాకను పురస్కరించుకుని కన్యాకుమారి అంతటా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. కాగా.. దేశం మొత్తంగా ఫలితంపై ఉత్కంఠగా ఉన్న నేపథ్యంలో ప్రధాని మోడీ ధ్యాన మార్గం పట్టడం గమనార్హం.