ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. గత ఎన్నికల తరహాలో ఈసారి సినీ రంగం నుంచి ప్రధాన పార్టీల్లోకి పెద్దగా చేరికలు కనిపించడం లేదు. అప్పుడు పలువురు సినీ ప్రముఖులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కొందరు ఆ పార్టీ కోసం ప్రచారం చేసిపెట్టారు. ఐతే ఈసారి వైసీపీకి సినిమా గ్లామర్ బాగా తగ్గినట్లే కనిపిస్తోంది.
మరోవైపు టీడీపీకి ఎప్పుడూ అండగా ఉండే సినీ వర్గం పెద్దదే. ఇప్పుడు కొత్తగా యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ ఆ పార్టీలో చేరడం విశేషం. చిన్న వయస్కుడు, పైగా కెరీర్లో మంచి ఊపులో ఉన్న నిఖిల్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడని.. పార్టీలో చేరతాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ అతను నారా లోకేష్ సమక్షంలో పసుపు కండువా కప్పుకుని ఆ పార్టీలో చేరాడు. టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం కూడా చేయబోతున్నాడు నిఖిల్.
ఐతే నిఖిల్ ఇప్పుడు టీడీపీలో చేరడానికి వేరే బలమైన కారణం ఉంది. అతడి మావయ్య కృష్ణయ్య యాదవ్ టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ దక్కించకున్న కృష్ణయ్య యాదవ్.. నిఖిల్ మావయ్యే. ఆయన తనయురాలైన పల్లవినే నిఖిల్ రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే ఈ జంటకు బిడ్డ కూడా పుట్టింది.
తన మావయ్య కృష్ణయ్య యాదవ్కు టికెట్ ఇచ్చినందుకు టీడీపీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు చెబుతూ పోస్టు కూడా పెట్టాడు నిఖిల్. త్వరలో అతను చీరాలకు వెళ్లి మావయ్య కోసం ప్రచారంలో పాల్గొనబోతున్నాడు. దాంతో పాటు వేరే నియోజవకర్గాల్లో కూడా టీడీపీ కోసం క్యాంపైనింగ్ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం నిఖిల్ స్వయంభు అనే భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.